కురవి, జూన్ 01 : ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఏ.మురళీకృష్ణ అన్నారు. మన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిద్దాం- నాణ్యమైన విద్యను అందిద్దాం అనే నినాదంతో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని మొగిలిచర్ల, కంచర్లగూడెం తండా, రాజోలు, బలపాల గ్రామాలలో జీప్ జాతా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు నేడు డిజిటల్ తరగతులు, లైబ్రరీలు, ఆటస్థలాలు, ఏఐ బోధనలతో సమృద్ధిగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. నిపుణులైన ఉపాధ్యాయులు ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నారని తెలిపారు.
గత పదేళ్లుగా యూటీఎఫ్ పోరాటాల ఫలితంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభ మైందన్నారు. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలతో ఉపాధ్యాయుల కొరత కొంత మేర తీర్చబడిందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎస్.కే. యాకూబ్, జిల్లా కార్యదర్శి పి. మంజుల, మండల ప్రధాన కార్యదర్శి ఎం. ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు పి. లక్ష్మయ్య, బి. బాబు, ఏ. రమ్య, ఎస్ఎఫ్ఐ నాయకులు గంధసిరి జ్యోతిబసు, మహేష్, బిక్షపతి, తరుణ్, సిపిఎం నాయకులు గంధసిరి శ్రీనివాస్, కట్ల కృష్ణయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.