నయీంనగర్, జూన్ 30 : హనుమకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని మున్సిపల్ కార్మికులు మంగళవారం ముట్టడించారు. రాష్ట్రంలోని 65 వేల మంది పారిశుధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశా రు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యం లో ఉదయం హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రదర్శనగా సురేఖ ఇంటికి బయలుదేరారు.
ఈ క్రమంలో పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో వారు ఒక్కసారిగా వాటిని తోసుకొని వెళ్లే క్రమంలో పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకోగా కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. అయినప్పటికీ కార్మికులు సురేఖ ఇంటి గేటు వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
సుప్రీంకోర్టు తీర్పుకనుగుణంగా మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని, పరకాలలో తొలగించిన 20 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకే బీజేపీ నాలుగు లేబర్ కోడ్స్‌ను తీసుకొచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం 8 గం టల పని విధానాన్ని 10 గంటలకు మారుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు.
రెండున్నరేండ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచడంలో పూర్తిగా విఫలమైందని, రాబో యే కాలంలో సర్కారును గద్దెదించాలని పిలుపునిచ్చారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి అందజేశారు. జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్యతో పాటు చక్రపాణి, కోటేశ్వర్, మహేశ్, బాబు, రఘు, నరేశ్, మల్లయ్య, సునీల్, అనిల్, ప్రమోద్, నాగరాజు, ఐలయ్య, సుమన్, శ్రీధర్ పాల్గొన్నారు.