వరంగల్, ఫిబ్రవరి 9 : మున్పిపల్ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం ముగిసింది. ఇక మిగిలింది పోలింగ్, ఓట్ల లెక్కింపు మాత్రమే. ఇందుకోసం అధికారులు సన్నద్ధమవుతున్నారు. జనవరి 27న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన రోజు నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. నామినేషన్లు, ఉపసంహరణ అనంతరం ఈ నెల 3 నుంచి అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేశాయి. ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల పరిధిలోని 260 వార్డుల్లో బరిలో నిలిచిన 1072 మంది అభ్యర్థులు ఆరు రోజుల పాటు హోరెత్తించారు.
రెండు రోజులుగా పలు పార్టీల అగ్రనేతలు ఉమ్మడి జిల్లాలో సుడిగాలి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆది, సోమవారాల్లో నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరు, భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్ మున్సిపాలిటీల్లో రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొని శ్రేణుల్లో జోష్ నింపారు. కేటీఆర్ రోడ్‌షోలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్‌కు భూపాలపల్లిలో సీఎం సభ నిర్వహించినా కలిసొచ్చే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు దొరకక ఇబ్బందులు పడుతున్న బీజేపీ రాష్ట్రస్థాయి నాయకులు ప్రచారానికి ముఖం చాటేయడంతో మరింత డీలా పడింది.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశా రు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో 260 వార్డు ల కోసం 525 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 3,35, 272 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నా రు. ఈ నెల 11 (బుధవారం)న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకోసం మంగళవారం పోలింగ్ సిబ్బంది సామగ్రితో ఆయా కేంద్రాలకు తరలివెళ్లనున్నారు. అలాగే 13న (శుక్రవారం) ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు భారీ బందోబస్తు చేపడుతున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద 163 సెక్షన్ (బీఎన్ఎస్ ఎస్సీఆర్పీపీ) విధిస్తున్నారు.