హనుమకొండ, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. పోలీసులను ముందు పెట్టి అరాచకానికి తెగబడింది. బీఆర్ఎస్కు మెజారిటీ ఉన్న మున్సిపాలిటీల్లోనూ అడ్డగోలుగా, జులుంతో అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నించింది. ఎలాగైనా చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు అడ్డగోలుగా వ్యవహరించింది. అధికార పార్టీ అరాచకాల కారణంగా తొర్రూరు, జనగామ మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. డోర్నకల్ మున్సిపాలిటీ ప్రత్యేక సమావేశానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు సమయానికి రాకపోవడంతో ఇక్కడా వాయిదా పడింది.
మూడు చోట్ల మంగళవారం ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. తొర్రూరులో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు తెరలేపింది. వరంగల్ లోక్‌సభ సభ్యురాలు కడియం కావ్య 2025 జనవరి 29న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఓటు నమోదు చేసుకున్నారు. అక్రమంగా తొర్రూరు మున్సిపాలిటీలోనూ ఓటు వేసేందుకు అక్కడికి చేరుకున్నారు. నిబంధనల ప్రకారం కడియం కావ్యకు తొర్రూరు మున్సిపాలిటీలో ఓటు హక్కు కల్పించొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రతినిధులు ఎన్నికల అధికారికి మరోసారి ఫిర్యాదు చేశారు.

తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులకు బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డులు గెలుచుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్‌కు ఎనిమిది ఓట్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్యత ఉండడం, కచ్చితంగా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ పోలీసులను రంగంలోకి దింపి భయాందోళనలు సృష్టించింది. జనగామలోనూ కాంగ్రెస్ పార్టీ భయానక పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నించింది. పోలీసులతో బీఆర్ఎస్ వారిపై పదపదే దాడులకు యత్నించి ప్రశాంత వాతావరణం సాకును చూపుతూ ఎన్నికను వాయిదా వేసింది.
జనగామ మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో బీఆర్ఎస్ 13 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ 12 స్థానాల్లో, సీపీఎం ఒక వార్డులో గెలిచాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు హక్కుతో బీఆర్ఎస్, కాంగ్రెస్-సీపీఎం బలం సమానంగా ఉన్నాయి. నలుగురు ఇండిపెండెంట్ల ఓటు కీలకం కావడం.. వీరి మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకునే పరిస్థితి ఉన్నది. అయితే, అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసి గెలిచేందుకు ప్రయత్నించింది. నిబంధలన ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ అభ్యర్థి మున్సిపల్ చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉన్నది. ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిడితో అధికారులు ఈ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు.
తొమ్మిది చోట్ల పూర్తి
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, మహబూబాబాద్, పరకాల, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, ములుగు, మరిపెడ, వర్ధన్నపేట, కేసముద్రం మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు పూర్తయ్యాయి. అధికార పార్టీ అభ్యర్థులు ఈ పదవులకు ఎన్నికయ్యారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో బీఆర్ఎస్ 6 చోట్ల, కాంగ్రెస్ 5 చోట్ల, ఒక స్థానంలో ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థులు చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నికయ్యారు. కేసముద్రంలోని 16 వార్డుల్లో బీఆర్ఎస్ 8 స్థానాలు, కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకున్నాయి. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థులు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నికయ్యారు.
డోర్నకల్‌లో ఆలస్యం
మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో వింతలు జరిగాయి. డోర్నకల్ మున్సిపాలిటీ ప్రత్యేక సమావేశానికి కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ కౌన్సిలర్లు సమయానికి రాలేదు. చైర్మన్ ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో నిర్వహించిన క్యాంపు నుంచి బయలుదేరిన ఆ పార్టీ కౌన్సిలర్లు గడువు ముగిసిన తర్వాత పట్టణానికి చేరుకున్నారు. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు మున్సిపాలిటీ ప్రత్యేక సమావేశం మొదలు కావాలి. డోర్నకల్ మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో 11 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ప్రత్యేక సమావేశానికి వీరు రాకపోవడంతో, సమావేశ నిర్వహణకు అవసరమైన కనీస సభ్యుల గైర్హాజరు(కోరం లేకపోవడం)తో అధికారులు ఈ ప్రక్రియను మంగళవారానికి వాయిదా వేశారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ కౌన్సిలర్లు కీలకమైన తొలి సమావేశానికి సమయానికి రాలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తొర్రూరులో హై టెన్షన్
తొర్రూరు : మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి తొర్రూరుకు చేరుకున్నారు. అయితే, అన్నారం రోడ్డు వద్ద ఆయనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం తెలుపడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం దయాకర్‌రావుకు ముందుకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అదే సమయంలో ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డి మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. భారత పౌరసత్వం లేని వ్యక్తిని కార్యాలయంలోకి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించడంతో దీంతో పోలీసులు ఝాన్సీరెడ్డిని అకడి నుంచి పంపించారు.
అనంతరం వరంగల్ ఎంపీ కడియం కావ్య తొర్రూరు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకునే క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఒకే ఓటును రెండుచోట్ల వినియోగించొద్దని ఆరోపిస్తూ ఖమ్మంవరంగల్ జాతీయ రహదారిపై కారుకు అడ్డంగా బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ లాఠీచార్జి చేసి కార్యకర్తలను చెదరగొట్టి, ఎంపీ కడియం కావ్యను కార్యాలయంలోకి అనుమతించారు. దీంతో పట్టణంలో మరింత ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పీఏ భాసర్పై కాంగ్రెస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని ఆయనను రక్షించారు. విషయం తెలుసుకున్న దయాకర్‌రావు మున్సిపల్ కార్యాలయం సమీపంలో నిరసనకు దిగారు. పరిస్థితి అదుపుతప్పేలా ఉండడంతో ఎస్పీ శబరీష్ రంగంలోకి దిగి ఎర్రబెల్లిని బుజ్జగించి అకడి నుంచి పంపించారు.
ఇంత నీచ రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు..
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను వివిధ రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు అందరికీ తెలుసన్నారు. మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ తరఫున చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా విప్ జారీ చేసేందుకు తాను లోపలికి వెళ్లాల్సి ఉన్నా, అధికార పార్టీ అండతో పోలీసులు లోపలికి అనుమతించకుండా బయటకు పంపించారని మండిపడ్డారు.
పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అత్త ఝాన్సీరెడ్డికి భారత పౌరసత్వం లేదని, ఆమె మున్సిపల్ కార్యాలయంలోకి ఎలా ప్రవేశిస్తారని, ఆ హకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. మున్సిపల్ కార్యాలయంలో తమ బీఆర్ఎస్ కౌన్సిలర్లను వేరే గదిలోకి తీసుకెళ్లి కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తూ పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారని కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇలాంటి రౌడీ రాజకీయాలు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.