రామగిరి, జులై 23: మహాత్మా గాంధీ యూనివర్సిటీ యాజమాన్యం అణిచివేత ధోరణిని నిరసిస్తూ విద్యార్థి నాయకుడు అనుముల సురేష్ వైస్ చాన్స్‌లర్ చాంబర్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేశారు. పరిపాలనా ఒత్తిళ్లతో వీసీ తమ విద్యా హక్కులకు భంగం కలిగిస్తున్నారని పలువురు విద్యార్థులు ఈ సందర్భంగా ఆరోపించారు.
గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సెమిస్టర్ పరీక్షలకు హాజరుకావాల్సిన విద్యార్థి నాయకుల హాల్ టికెట్లను అధికారులు కావాలని నిలిపివేసి, మానసికంగా వేధించారని సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ప్రశ్నించే వారిపై ఇలా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని సురేష్ హితవు పలికారు.
స్పందించిన రిజిస్టర్
సెమిస్టర్ హాల్‌టికెట్ల కోసం వైస్ చాన్స్‌లర్ చాంబర్ ఎదుట విద్యార్థులు ఆందోళనపై రిజిస్టర్ ప్రొఫెసర్ కె అంజిరెడ్డి సత్వరమే స్పందించారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సోషల్ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసిన ఆయన విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వాలని, పరీక్షకు అనుమతించాలని ఆదేశించారు. ఆ తర్వాతే తమకు హాల్ టికెట్ ఇచ్చారని విద్యార్థులు తెలిపారు. అకారణంగా హాల్ టికెట్లు నిలిపివేయడం.. ఆపై తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారులు ప్రయత్నించడం సరైంది కాదని విమర్శించారు.