కొత్తగూడ/ గంగారం, ఫిబ్రవరి 15 : మేడారం మహాజాతర గడియలు సమీపించాయి. అపురూప ఘట్టం ఆవిష్కృతానికి మరికొన్ని గంటలే మిగిలిఉన్నాయి. వనంబాట పట్టిన భక్తజనం తల్లుల రాక కోసం నిలువెల్లా కన్నులై ఎదురు చూస్తున్నది. ఈ క్రమంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం జాతరలో కొలువుదీరడానికి గిరిజన సంస్కృతీ సంప్రదాయాల నడుమ మంగళవారం బయలుదేరారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి వడ్డెలు, పూజారులు పగిడిద్దరాజు పడిగెతో అటవీమార్గం గుండా మేడారం బాటపట్టారు. దీంతో పూనుగొండ్ల గ్రామం పులుకరించింది. ఆధ్యాత్మిక శోభ సంతరించుకోంది. పూనుగొండ్ల గ్రామంలో పెనక వంశీయులు పగిడిద్దరాజును కొలుస్తూ రెండు సంవత్సరాలకోసారి జరిగే మేడారం జాతరకు పగిడిద్దరాజును వరుడుగా తయారు చేసి తరలించడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగానే తలపతులుగా భావించే పెనక వెంకటేశ్వర్లు ఇంట్లో ఉన్న పసుపు, కుంకుమతో పూజలు చేసి, అక్కడి నుంచి డప్పు వాయిద్యాల నడుమ నేరుగా పగిడిద్దరాజు దేవాలయానికి వెళ్లారు. పసుపు, కుంకుమను ఎరుపురంగులో ఉన్న బట్టతో కప్పి దేవాలయంలో పెట్టి మొక్కులు సమర్పించారు.
అనంతరం పూజారులు వెదురును తీసుకొచ్చి పడిగిద్దరాజు ప్రతిమను తయారు చేసి, గద్దెపై ప్రతిష్ఠించారు. ఈ క్రమంలో శివసత్తుల పూనకాలు, డప్పు వాయిద్యాలతో పగిడిద్దరాజు దేవాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పడిగెను తయారు చేసి మొక్కుల సమర్పించిన తర్వాత వడ్డెలు కల్తి జగ్గారావు పగిడెను పట్టుకుని గ్రామం గుండా బయలుదేరారు. పూజారులు సైతం పడిగెతో తరలివెళ్లారు. గతంలో కంటే ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గ్రామంలో పూజలందుకున్న పగిడిద్దరాజు గ్రామం దాటేవరకు మహిళలు నీళ్లారబోస్తూ ‘వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్యా.., బాటసారులకు ఎలాంటి ఆపద కలుగకుండా తీసుకెళ్లవయ్యా’ అంటూ మొక్కుకున్నారు. పగిడిద్దరాజును తరలించేందుకు మేడారం ట్రస్ట్‌బోర్డు డైరెక్టర్ బండి వీరస్వామి, కొత్తగూడ, గంగారం ఎంపీపీలు విజయ, సరోజన, జడ్పీటీసీలు రమ, పుష్పలత, సర్పంచ్ చెరుకుల సారలక్ష్మి హాజరై మొక్కులు చెల్లించారు. కాగా, పూజారులు, వడ్డెలు నియమనిష్ఠలతో పగిడిద్దరాజును తొడ్కొని అటవీమార్గం గుండా పయనమయ్యారు. వారి వెంట వందల సంఖ్యలో గిరిజన గూడేల ప్రజలు ఉన్నారు. సుమారు 70 కిలోమీటర్ల అటవీమార్గం గుండా కాలినడకన ప్రయాణం చేసి మేడారానికి చేరుకుంటారు. మార్గమధ్యలో కర్లపెల్లి, లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంట్లో సేద తీరుతారు.
పెనక వంశీయులైనందున వచ్చిన వారికి అతిథ్యం ఇచ్చి ప్రతిమను అక్కడ ఉన్న గద్దెపై ప్రతిష్ఠిస్తారు. వారు ఇచ్చిన విందు తీసుకొని బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు తిరిగి బయలుదేరి సాయంత్రం 6 గంటల వరకు మేడారానికి చేరుకుంటామని ప్రధాన పూజారులు పెనక బుచ్చిరాములు, సురేందర్, రాజేశ్, పురుషోత్తం, వెంకన్న, రామస్వామి తెలిపారు. కాగా, పస్రాకు వెళ్లగానే భక్తులు అధిక వస్తారని, త్వరగా వేళ్లేందుకు ఈ ఏడాది పోలీసుల సహాయం కోరినట్లు తెలిపారు. సమ్మక్కతో వివాహం అనంతరం మూడురోజులపాటు జాతరలో సమ్మక్క, సారలమ్మలతో సమానంగా పగిడిద్దరాజు భక్తులు మొక్కలు చెల్లిస్తారు. తదనంతరం సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు వనప్రవేశం చేస్తారు. వారితోపాటు పగిడిద్దరాజు తిరిగి పూనుగొండ్లకు చేరుకుంటారు. అక్కడ నుంచి వచ్చిన రెండు రోజులకు అనగా 23 నుంచి 25వరకు పగిడిద్దరాజు మరువెళ్లి జాతరను పూనుగొండ్లలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే కోరిన కొర్కెలు తీరుతాయని గిరిజన, గిరిజనేతరుల నమ్మకం. పగిడిద్దరాజు దేవాలయంలో అడినషల్ డీసీపీ సాయి చైతన్య, సీఐ వినయ్ ప్రత్యేక పూజలు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్ కెమెరాతో పర్యవేక్షించారు. పగిడిద్దరాజు గుడి ప్రాంగణం నుంచి అటవీ మార్గానికి వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు నిర్వహించారు.

తాడ్వాయి, ఫిబ్రవరి 15 : కన్నెపల్లిలో కొలువైన జంపన్న మంగళవారం రాత్రి 6:38 గంటలకు గద్దెపైకి చేరుకున్నాడు. పూజారి పోలెబోయిన సత్యం కన్నెపల్లిలోని ఇంటిలో పూజా సామగ్రిని శుద్ధి చేసిన అనంతరం జంపన్న గద్దెకు అలుకుపూతలు నిర్వహించారు. జంపన్న ప్రతిరూపమైన డాలు, కర్రకు దూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం డోలువాయిద్యాల నడుమ జంపన్న డాలు, కర్రతో జంపన్న వాగు ఒడ్డున ఉన్న గద్దె వద్దకు బయలుదేరాడు. ఆయన వెంట జంపన్న వడ్డె సాంబశివరావు హనుమంతుడు డాలుతో ముందు నడవగా గ్రామ మహిళలు ఊరు పొడవునా నీళ్లారబోస్తూ జంపన్నను సాగనంపారు. నేడు సారలమ్మ గద్దెపైకి చేరే క్రమంలో తమ్ముడు జంపన్నను పలుకరిస్తూ గద్దెను చేరుకోనుంది. పూజారి సత్యం నాలుగు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉపవాస దీక్షలు చేస్తూ అత్యంత నియమనిష్టలతో జంపన్నను గద్దెపై ప్రతిష్టించారు. శనివారం తిరుగువారం పండగ నిర్వహించి జంపన్నను కన్నెపల్లిలోని గుడికి తీసుకెళ్లనున్నారు.
తాడ్వాయి, ఫిబ్రవరి15 : మేడారం జాతరను పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలోని భద్రాచలానికి చెందిన వీరమ్మ జంపన్నవాగు సమీపంలో తల్లుల విగ్రహాలను తయారు చేసి జీవనోపాధి పొందుతుంది. వికలాంగురాలైన వీరమ్మకు ఒక్క చేయి పనిచేయదు, భర్త లేకపోవడంతో కొడుకుతో కలిసి దేశంలోని పలు రాష్ర్టాల్లో జరిగే జాతరలు, కుంభమేళలో ఇలా దేవతల విగ్రహాలను తయారు చేసి పొట్టనింపుకుంటుంది.