ములుగు, మే 29 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా కేంద్రంలో కిరాయి భవనంలో కొనసాగుతున్న బాల సదనంలో (Balasadanam) చిన్నారులకు రక్షణ కరువైంది. ఇందుకు ఉదాహరణగా బాల సదనం నుంచి సోమవారం ఓ బాలిక పారిపోవడమే నిదర్శనం. సంక్షేమ శాఖ అధికారులు విషయాన్ని గమనించి బాలిక కోసం గాలించగా మరుసటిరోజు ఉదయం వరంగల్‌లో ఆచూకీ లభించినట్లు తెలిసింది. బాలిక పారిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, సదరు బాలిక మిస్సింగ్ అయిన సమయంలో సెలవుపై వెళ్లిన డీడబ్ల్యూవో శిరీషపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను పోస్టు నుంచి తప్పించారు. దీంతోపాటు తాడ్వాయి మండలానికి చెందిన అంగన్వాడీ సూపర్వైజర్ బాల సదనం సూపరింటెండెంట్‌గా కొనసాగుతుండగా ఆమెపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించినట్లు తెలిసింది. అయితే అంతకు ముందు బాలిక హనుమకొండలోని సదార్ హోమ్ ఉన్నట్లు సమాచారం. బాలిక మిస్సింగ్‌తో జిల్లాలో ఇద్దరు అధికారులపై వేటు పడినట్లు అయింది.
కాగా, సెలవులో ఉన్న డీడబ్ల్యూవోపై వేటు వేయడం, ఆమె స్థానంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా, జిల్లా క్రీడల యువజన సర్వీసుల శాఖ అధికారిగా, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారిగా కొనసాగుతున్న తుల రవికి అదనంగా డీడబ్ల్యూవో పోస్టు కట్టబెట్టడంపై అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మూడు శాఖలకు జిల్లా అధికారిగా పనిచేస్తూ నాలుగో శాఖలో సైతం నియమించడంతో ఏ శాఖలో ఏ సమయంలో అందుబాటులో ఉంటాడోనని తెలియకుండా ఉందని ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. గతంలో బాల సదనం ప్రభుత్వ భవనంలో కొనసాగగా కరోనా సమయంలో బాల సదనం మొత్తం ఖాళీ కాగా అధికారులు సదరు బాల సదనం భవనంలో డీడబ్ల్యూవో కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యమైన బాల సదనంను విసిరిపారేసినట్లు ఎక్కడో అరకొర సౌకర్యాలతో కిరాయి భవనంలో కొనసాగుండటంతో సదరు బాలసదనంపై పర్యవేక్షణ లోపించినట్లు తెలుస్తున్నది.