ములుగు, సెప్టెంబర్ 08 : పారిశుధ్య కార్మికుడు మైదం మహేశ్ కుటుంబానికి న్యాయం జరిగే దాకా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి తెలిపారు. గత ఆరు నెలలుగా జీతాలు అందక, అధికారుల వేధింపులు తట్టుకోలేక ములుగు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడు మైదం మహేశ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పారిశుధ్య కార్మికుడి ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనేనన్నారు. దీనికి మంత్రి సీతక్క బాధ్యత వహించాలన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఏరియా హాస్పిటల్ నుండి బస్టాండ్ వరకు భిక్షాటన చేశారు.
ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన సర్కార్ మహేశ్ మరణంపై ద్రుష్ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. మంచినీళ్లు అనుకుని పురుగుల మందు తాగినట్టు చెప్పి ఒక ఫేక్ వీడియోను సృష్టించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఆదుకోవాల్సిన సర్కారు ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టడంపై ఆమె మండిపడ్డారు. తప్పుడు చర్యలతో ప్రభుత్వం ఘోర వైఫల్యం కప్పిపుచ్చుకోలేదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు మండలాధ్యక్షుడు సానికొమ్ము రమేశ్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ చెన్న విజయ్, వేములపల్లి భిక్షపతి, పోరిక విజయ్, రామ్ నాయక్, గొర్రె సమ్మయ్య, కోగిల మహేశ్, వేల్పుల సత్యం, ఆకుతోట చంద్రమౌళి, గరిగే రఘు, బైకాని సాగర్, గండి కుమార్, కవ్వంపల్లి బాబు, గడ్డమీది భాస్కర్, యూనిస్, మాదం సాగర్, వాంకుడోత్ రాందాస్, దూడబోయిన శ్రీనివాస్, గజ్జి నగేశ్, సోహెల్, కోడపాక మహేందర్, జట్టి పున్నం, దేవర రాజు, ఇరుప విజయ, మర్రి అంకుష్, ఎండీ ఖాసీం, ఆరెపల్లి కిషన్ పాల్గొన్నారు.