ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కోతుల బెడద తప్పించుకోవడానికి పెట్టిన విషగుళికలు తిని నాలుగేళ్ల బాలుడు మరణించాడు.
వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా గోవిందరావుపేటలోని కోతుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో కోతులను చంపేందుకు అంగన్వాడీ కేంద్రంలోని నర్సరీ ప్రాంతంలో గ్రామ పంచాయతీ సిబ్బంది విషగుళికలను పెట్టారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న పిల్లలకు ఇచ్చే బాలామృతంలో వాసన లేకుండా ఉండే విష గుళికలను కలిపి పెట్టారు.
ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు శ్రవణ్ కుమారుడు హర్షిత్ నందన్ (4) ఆదివారం సాయంత్రం స్నేహితులతో ఆడుకుంటూ అంగన్వాడీ కేంద్రం సమీపంలోకి వెళ్లాడు. ఆ సమయంలో విష గుళికలు కలిపిన బాలామృతం చూశాడు. దాన్ని తినేశాడు. అనంతరం అస్వస్థతకు గురవ్వడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ హర్షిత్ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు.