వాజేడు, జూలై 10 : గుట్టలు ఎక్కి, వాగులు దాటి గిరిజన ప్రజలకు వైద్యసేవలందించారు ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యసిబ్బంది. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో గుట్టలపై ఉన్న పెనుగోలు గిరిజన గ్రామానికి మంగళవారం ఉదయం వైద్యాధికారి మధుకర్ ఆధ్వర్యంలో వైద్య బృందం కాలినడకన వెళ్లింది. మూడువాగులు దాటి, మూడు గుట్టలు ఎక్కి సాయంత్రానికి 16 కిలోమీటర్ల దూరంలోని పెనుగోలుకు చేరుకున్నారు.
అక్కడ నివసిస్తున్న 10 కుటుంబాల్లోని 39 మందికి వైద్య పరీక్షలు చేశారు. జ్వరాలున్న ముగ్గురిని గుర్తించి మందులు అందజేశారు. గ్రామంలోని ఇంటింటికీ వెళ్ళి దోమల మందు స్ప్రే చేయించారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం పీహెచ్సీకి చేరుకున్నారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు చిన్న వెంకటేశ్వర్లు, కోరం శేఖర్, ల్యాబ్ టెక్నీషియన్ ఇర్ప రజినీకాంత్, సిబ్బంది లకన్, ప్రశాంత్, ఆశ కార్యకర్త సమ్మక్క, గుమ్మడిదొడ్డి గ్రామస్తులు కారం ఆదినారాయణ, జజ్జెరి అశోక్ పాల్గొన్నారు.
వాగులు దాటుకుంటూ వైద్యం 
గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురం పీహెచ్సీ పరిధిలోని మట్టెవాడ శివారు తిమ్మాపురం గ్రామానికి వైద్యసిబ్బంది వాగులు, వంకలు దాటుకుంటూ 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సదర్భంగా డాక్టర్ యమున మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల్లోనే గిరిజనులు ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలన్నారు. 42 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు దేవేందర్, నరేశ్, సిబ్బంది లోక్యానాయక్, అరుణ, హేమలత, రజిత, సర్దార్, లాలు, కవిత, ఆశ, సీతమ్మ పాల్గొన్నారు.