క్యాతనపల్లిలో ప్రజలు బీఆర్ఎస్ను గెలిపిస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చినా అధికార పార్టీ అడ్డదారిలో గెలిచేందుకు యత్నిస్తున్నది. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రిటర్నింగ్ అధికారులు, పోలీసులు కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో పనిచేయడం దురదృష్టకరం.
– కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ కబ్జా రాజకీయం నడుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. క్యాతనపల్లిలో ప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ను అక్రమంగా అరెస్ట్ చేసి దళితనేత గొంతునొక్కుతున్నదని నిప్పులు చెరిగారు. బడుగు బలహీనవర్గాల గొంతుకగా ఉన్న దళితనేతను నోటీసు ఇవ్వకుండా, పోలీసులను ఉసిగొల్పి బందిపోటు మాదిరిగా అరెస్ట్ చేశారని, ఇది రేవంత్ సర్కార్ పిరికిపంద చర్యకు నిదర్శనమని తూర్పారబట్టారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన మంత్రి వివేక్ క్యాతనపల్లిలో ఎన్నిక ప్రక్రియను శాసిస్తూ ప్రజాతీర్పును కాలరాస్తున్నారని బుధవారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కడ ప్రజలు బీఆర్ఎస్ను గెలిపిస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చారని, కానీ కాంగ్రెస్ అడ్డదారిలో గెలిచేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రిటర్నింగ్ అధికారులు, పోలీసులు కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో పనిచేయడం దురదృష్టకరమని వాపోయారు. వారు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ విలువల పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిందని కేటీఆర్ విమర్శించారు. విధినిర్వహణను పక్కనబెట్టి అధికారపార్టీకి వంతపాడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. క్యాతనపల్లిలో ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వందల మంది ఖాకీల అండతో క్యాతనపల్లిలో మంత్రి వివేక్ అరాచకాలకు పాల్పడుతున్నారని, ఎన్నిక ప్రక్రియలో అక్రమాలపై ప్రశ్నించిన బాల్క సుమన్‌పై అక్రమ కేసులు పెట్టి వేధించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
బాల్కసుమన్‌తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేతలు, కార్యకర్తలపై వేధింపులను ఆపాలని పోలీసులను డిమాండ్ చేశారు. లేదంటే ఇప్పుడు అధికార పార్టీ, ముఖ్యమంత్రి, మంత్రి అడుగులకు మడుగులొత్తుతూ రాజ్యాంగ విలువలను మంటగలుపుతున్న ప్రతి ఒక్క పోలీసు అధికారి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నదని విమర్శించారు. తొర్రూరు, జనగామ, జహీరాబాద్, క్యాతనపల్లిలో జరిగిన ఘటనలను చూస్తుంటే అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా? అనే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన కౌన్సిలర్లను అధికార కాంగ్రెస్ నేతలు సంతలో పశువుల కన్నా అధ్వానంగా కొనుగోలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. దొరకని, ప్రలోభాలకు లొంగని వారిని పోలీసులతో కిడ్నాప్ చేయించి అరాచకపర్వాన్ని పరాకాష్టకు చేర్చారని ధ్వజమెత్తారు.
అక్రమ అరెస్ట్‌లతో తమ గొంతునొక్కలేరని..ప్రజాస్వామ్య హననానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటాన్ని ఆపలేరని కేటీఆర్ తేల్చిచెప్పారు. జనగామలో ఒక దళిత మహిళా ప్రజాప్రతినిధిపై కాంగ్రెస్ గూండాలు అధికారుల ముందే దాడులు చేస్తున్నా రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆక్షేపించారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని నిలదీశారు.
అక్రమంగా అరెస్ట్ చేసిన బాల్క సుమన్, బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకొని మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, కాంగ్రెస్ సాగించిన దమనకాండపై విచారణ జరిపించాలని విజ్ఞప్తిచేశారు. అధికార పార్టీ మెప్పు కోసం చట్టాన్ని అతిక్రమిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ సర్కార్ రాక్షస పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
జనగామలో బీఆర్ఎస్కు మద్దతుగా చేతెత్తిన దళిత మహిళా కౌన్సిలర్‌పై రిటర్నింగ్ ఆఫీసర్ సాక్షిగా కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తెలంగాణ సమాజం కండ్లారా చూసిందని హరీశ్ పేర్కొన్నారు. తమ కండ్లెదుట ఒక దళిత మహిళా నాయకురాలిపై కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడితే అధికారులు, పోలీసులు కండ్లప్పగించి చోద్యం చూశారే తప్ప అడ్డుకోకపోవడం దుర్మార్గమని ఆక్షేపించారు. రక్షించాల్సిన పోలీసులు నిస్సిగ్గుగా కాంగ్రెస్ గూండాలకు కొమ్ముకాయడం కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలు పతనమైపోతున్న తీరుకు నిదర్శనమని స్పష్టంచేశారు.
ఒక్క క్యాతనపల్లిలోనే కాదు తొర్రూరు, జనగామ, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ సహా హంగ్ వచ్చిన ప్రతిచోటా ప్రజాతీర్పును పరిహసిస్తూ చైర్మన్ పీఠాలను అడ్డదారుల్లో దక్కించుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భూములను కబ్జా చేసినట్టే, రాజకీయ పీఠాలను సైతం కబ్జా చేస్తున్నారని విరుచుకుపడ్డారు. బాల్క సుమన్‌ను భేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామిక వాతావరణంలో క్యాతనపల్లి చైర్మన్ ఎన్నిక జరిగేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉన్నదని తేల్చిచెప్పారు. చట్టపరిధిలో చైర్మన్ ఎన్నిక జరిపించాలని డిమాండ్ చేశారు.
క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, దురహంకార చర్యలను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే, దళిత నేత బాల్క సుమన్ అరెస్ట్ శోచనీయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఖండించారు. క్యాతనపల్లిలో బీఆర్ఎస్ పూర్తి మెజారిటీ సాధించినా కాంగ్రెస్ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరును చూసి యావత్ తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నదని ధ్వజమెత్తారు.
మున్సిపల్ ఎన్నికల్లో అధికార, పోలీసు, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని అభివర్ణించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ గూండాగిరీ రాజ్యమేలుతున్నదని నిప్పులు చెరిగారు. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మురుగు రాజకీయాల వాసన కమ్ముకున్నదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హంగ్ వచ్చిన చోట్ల ప్రతిపక్ష అభ్యర్థులను సంత బేరం చేస్తూ, కిడ్నాప్‌లకు తెగబడుతూ ప్రజాతీర్పును కాలరాస్తున్న తీరు దుర్మార్గమని ధ్వజమెత్తారు.