ఢిల్లీలో జరుగుతున్న కృత్రిమ మేధ (ఏఐ) సదస్సు చాలా రకాలుగా భారత్‌కు ప్రతిష్ఠాత్మకమైనదని చెప్పవచ్చు. వందకు పైగా దేశాలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. శామ్ ఆల్ట్‌మన్, సుందర్ పిచాయ్ వంటి టెక్ దిగ్గజాలు హాజరవుతున్నారు. వర్ధమాన ప్రపంచంలో ఇలాంటిది జరుగడం ఇదే ప్రథమం. అయితే ఆరంభం రోజే సరైన సౌకర్యాలు లేకపోవడం, ఒక్కసారిగా సందర్శకులు వచ్చిపడటంతో గందరగోళ పరిస్థితులు నెలకొనడం, సదస్సు గొప్పతనం కన్నా ఈ తొక్కిసలాటే ప్రపంచ వ్యాప్తంగా వివిధ మాధ్యమాల్లో పతాక శీర్షికలకు ఎక్కడం విచారకరం. ప్రాంగణంలో కొన్ని వస్తువులు చోరీకి గురైనట్టు ఫిర్యాదులు వెల్లువెత్తడం మరీ దారుణం. ఘనమైన సదస్సుకు ఏర్పాట్లు సరైన రీతిలో జరుగలేదని, నిర్వహణాపరమైన లోపాలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆహూతులు ఎదుర్కొన్న ఇబ్బందులకు వీఐపీ భద్రతా ఏర్పాట్లు కూడా కారణం కావడం గమనార్హం. దీనంతటికీ కేంద్ర ఐటీ మంత్రి స్వయంగా క్షమాపణలు చెప్పుకున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా అస్తవ్యస్త పరిస్థితుల కారణంగా పరువు పోయిన తర్వాత ఓ వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టు మంత్రి ప్రకటించడం విడ్డూరం. పోయిన వస్తువులను పోలీసులు పట్టుకొని తిరిగి ఇచ్చేశారని అంటున్నారు. మరి, పోయిన పరువు మాటేమిటనేది ప్రశ్న.
ఢిల్లీ ఏఐ సదస్సు భారత్ బలాలు, బలహీనతలను ఏకకాలంలో వెలుగులోకి తెచ్చింది. ప్రపంచ ఐటీ రంగం ప్రధానమైన మలుపు తిరుగుతున్న దశలో ఈ సదస్సు జరుగుతున్నది. కొన్ని దశాబ్దాలుగా ఐటీ రంగం అంగలు వేస్తూ ప్రపంచ ఆర్థికరంగంలో ప్రధాన శక్తిగా ఎదిగింది. గ్లోబల్ ఐటీ సేవల మార్కెట్ ఈ ఏడాది 1.65 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిమాణాత్మక మార్పు ఏఐ రాకతో గుణాత్మక మార్పుగా పరిణమించింది. ఏఐ వల్ల కిందిస్థాయి ఉద్యోగాలకు భారీ కోతలు పడుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో ఐటీ షేర్లు పడిపోతున్నాయి. ఈ భయానక వాతావరణం నుంచి బయటపడేందుకు ఏఐలో ముందంజ సాధించడం ఒక్కటే మార్గం. కృత్రిమ మేధ రంగంలో పోటీతత్వంపై స్టాన్‌పోర్డ్ యూనివర్సిటీ నిరుడు డిసెంబర్లో విడుదల చేసిన ప్రపంచ సూచీలో అమెరికా, చైనా తర్వాత మూడోస్థానంలో భారత్ నిలువడం మనకు గర్వకారణం. అయితే ఇల్లలుకగానే పండుగ కాదన్నట్టుగా ఏఐ రంగంలో భారత్ ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉన్నదనేది వాస్తవం.
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఏఐ మార్కెట్‌గా ఉన్న ఇండియా విదేశీ నమూనాలను యథాతథంగా ఉపయోగించుకోవడం ఎంతవరకు సురక్షితం అనేది ఆలోచించుకోవాల్సి ఉన్నది. డాటా సెక్యూరిటీ అనేది ఈ ఆందోళన వెనుకనున్న అసలు సమస్య. ఏఐ డాటా సెంటర్లలో అత్యధికం అమెరికా, చైనాలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యం మొదలుకొని రక్షణ దాకా అన్నింట్లోనూ విదేశీ ఉత్పత్తులు, డాటా సెంటర్లను వాడుకోవడం సబబు కాదనేది చెప్పాల్సిన పనిలేదు. అందువల్ల ‘సార్వభౌమాధికార ఏఐ’ దిశగా భారత్ అడుగులు వేయాల్సి ఉన్నది. మన దగ్గర నైపుణ్యాలకు కొదువ లేనప్పటికీ ఏండ్ల తరబడి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పరిశోధనాభివృద్ధిపై తక్కువ పెట్టుబడుల సమస్య వల్ల ఇంకా అందుకోవాల్సిన ఎత్తులు చాలానే ఉన్నాయి. ఈ లోటును సరిద్దిదుకునే వరకు సిలికాన్ వ్యాలీ అల్గోరిథమ్స్‌కు ఇండియా టెస్టింగ్ ల్యాబ్గానే మిగిలిపోతుంది. ఢిల్లీ సదస్సులో ఎదురైనటువంటి నిర్వహణాపరమైన లోపాలకు తావులేకుండా ముందుకు సాగితేనే భారత్ ఏఐ రంగంలో అసలు సిసలు విజయాలు సాధిస్తుంది.