KTR | కోలీవుడ్ దర్శక దిగ్గజం భారతీరాజా మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం ఎంతో కలిచివేసిందని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా సంతాపం తెలిపారు.
భారతీయ సినిమాను వినూత్న మార్గంలో నడిపించిన మహోన్నత కళాకారుడు భారతీరాజా అని కేటీఆర్ కొనియాడారు. ఆయన రూపొందించిన సినిమాలు తరతరాలపాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయని అన్నారు. భారతీరాజా మరణం తమిళ సినీపరిశ్రమే కాకుండా భారతీయ సినిమాకు తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు, సినీ పరిశ్రమకు చెందిన సహచరులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
దిగ్గజ చలనచిత్ర దర్శకుడు భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించారు. తమిళ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు, తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (TFAPA) తమ వ్యవస్థాపకుడు, దిగ్గజ దర్శకుడైన భారతీరాజా తుది వీడ్కోలుకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలను కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. అసోసియేషన్ అభ్యర్థనకు స్పందించిన సీఎం విజయ్, ప్రభుత్వ గౌరవ వందనంతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు.