Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను అందుకుంటున్న ఈ చిత్రం వసూళ్ల పరంగా కూడా సత్తా చాటుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే రూ.332.1 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో క్రీడలు, భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, పోరాట స్ఫూర్తి వంటి అంశాలను దర్శకుడు బుచ్చిబాబు సాన ఆకట్టుకునే విధంగా చూపించారు. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. హీరోయిన్గా జాన్వీ కపూర్ నటించగా, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ, రవికిషన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘పెద్ది’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.218.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిస్థాయి విజయాన్ని నమోదు చేయాలంటే దాదాపు రూ.220 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. అంటే గ్రాస్ పరంగా రూ.440 కోట్ల మార్క్‌ను అందుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రూ.332 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన నేపథ్యంలో బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి మరో రూ.108 కోట్ల గ్రాస్ అవసరమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ‘పెద్ది’ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రధాన కేంద్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టినట్లు సమాచారం. మిగిలిన ప్రాంతాల్లో కూడా సినిమా నిలకడగా వసూళ్లు సాధిస్తుండటంతో మరో నాలుగు నుంచి ఐదు రోజుల్లో పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్‌ను అందుకునే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.