ములుగు, జూన్16(నమస్తేతెలంగాణ) : విద్యార్థులను సక్రమ మార్గంలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన డీఈవో వక్ర మార్గంలో పయనిస్తూ విద్యా శాఖకు చెడ్డ పేరు తీసుకొచ్చిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. రీపోస్టింగ్ ఆర్డర్ కోసం ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు 2024 ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదానికి గురై అక్టోబర్ వరకు సెలవులో ఉన్నాడు. అక్టోబర్ 1వ తేదీన పాఠశాలలో రిపోర్టు చేయగా, మూడు నెలలైనందున డీఈవోకు సరెండర్ చేశామని, అక్కడ రిపోర్టు చేయమని హెడ్మాస్టర్ చెప్పాడు.
అదేరోజు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చి జాయినింగ్ రిపోర్టు ఇవ్వగా, డీఈవో గార్ల పాణిని రూ.20 వేలు లంచంగా ఇస్తేనే రీపోస్టింగ్ ఆర్డర్ ఇస్తానన్నాడు. ఆర్డర్ తయారు చేసినందుకు జూనియర్ అసిస్టెంట్ తొట్టె దిలీప్కుమార్యాదవ్ రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ఈ నెల 12వ తేదీన సదరు ఉపాధ్యాయుడు కార్యాలయానికి వెళ్లి తాను డబ్బులు ఇచ్చుకోలేనని, తనకు జీతం కూడా రావడం లేదని ప్రాధేయపడినప్పటికీ డీఈవో పాణిని వినలేదు. చివరికి బ్రతిమిలాడగా తనకు రూ. 15వేలు, దిలీప్‌కు రూ.5వేలు ఇవ్వాలని చెప్పాడు. సదరు ఉపాధ్యాయుడికి లంచం ఇవ్వడం ఇష్టం లేక వరంగల్‌లోని ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించాడు.
ఆయన ఫిర్యాదు మేరకు సోమ వారం డీఈవోకు ఇచ్చే రూ.15వేలతో పాటు తనకు వచ్చే రూ.5వేలను జూనియర్ అసిస్టెంట్ దిలీప్‌కుమార్ ఉపాధ్యాయుడి నుంచి తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఫైల్ మూమెంట్ తనిఖీ చేస్తే ఫిబ్రవరిలోనే ఉపాధ్యాయుడి జాయినింగ్ ఆర్డర్ తయారు చేశాడని, డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఆర్డర్‌ను వారి వద్దనే ఉంచుకొని ప్రస్తు తం లంచం తీసుకొని ఇచ్చేందుకు ప్రయత్నించారని అన్నారు. డీఈవో పాణిని, జూనియర్ అసి స్టెంట్ దిలీప్కుమార్లపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని, నేడు వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1064 లేదా 9154388912కు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ దాడుల్లో అధికారులు ఎస్ రాజు, ఎల్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, రాత్రి 10 గంటలు దాటినా ఇంకా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతున్నట్లు తెలిసింది.