ములుగు టౌన్, 14: వచ్చే ఫిబ్రవరిలో జరిగే మినీ మేడారం జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో అంకిత్, మేడారం పూజారులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం సమ్మక సారలమ్మ గద్దెల పరిసర గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాగునీరు, టాయిలెట్స్, షెడ్స్, సకల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. గుడుంబా తయారీ కోసం అమ్మవారికి సమర్పించిన బెల్లాన్ని ఉపయోగించొద్దని, అందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎక్సైజ్‌శాఖ అధికారులను ఆదేశించారు.
మేడారం జాతరలో బెల్లం, కొబ్బరికాయల దుకాణాలను పూజారులకు కేటాయించాలని మేడారం ప్రధాన పూజారి సిద్ధబోయిన జగ్గారావు కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. మేడారంలో ఇప్పటికే పలు షెడ్లు భక్తుల సౌకర్యార్థం నిర్మించామని, 27 పూజారుల షాపుల కోసం నిర్మించామని కలెక్టర్ తెలిపారు. కొబ్బరికాయలు, బెల్లం పూజారులు అమ్ముకునే అవకాశం ఇవ్వాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ ఈవోను ఆదేశించారు. గద్దెల ప్రాంగణం చుట్టూ, ప్రధాన గేటు వద్ద షాపులను తొలగించే చర్యలు చేపట్టాలన్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద బెల్లం నిల్వ చేసే ప్రత్యేక షెడ్డును ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. 2024లో జరిగే మహాజాతరకు ఎనిమిది నెలల ముందు అభివృద్ధి పనులు చేపడతామని, ఈమేరకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.
ఎక్సైజ్‌శాఖ కంట్రోల్లో గెస్ట్‌హౌస్ ఏర్పాటు చేస్తామన్నారు. కొండాయిగ్రామంలో జరిగే గోవిందరాజుల దేవాలయానికి ఫెన్సింగ్ వేయిస్తామన్నారు. ఐటీడీఏ ఏటూరునాగారం ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేసి, జాతర అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టంచేశారు. సమీక్షలో డీఆర్వో రమాదేవి, ఎక్సైజ్ శాఖ ఏసీఆర్ నాగేందర్రావు, సూపరింటెండెంట్ వి.శ్రీనివాస్, డీఎంహెచ్‌వో డీపీవో వెంకయ్య, తాడ్వాయి తహసీల్దార్ ఎం.శ్రీనివాస్, ఈవో రాజేంద్రన్, సమ్మక-సారలమ్మ పూజారులు, అధికారులు పాల్గొన్నారు.