ములుగుటౌన్, నవంబర్29 : జిల్లా ప్రజలకు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్‌తో కలిసి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అండర్ ఇన్విస్టిగేషన్ పరిధిలో 14 కేసులు, పెండింగ్ ట్రయల్ కేసులు 70 అట్రాసిటీ కేసులు ఉన్నాయన్నారు. మళ్లీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించే నాటికి కేసుల దర్యాప్తులో పురోగతి కనిపించాలన్నారు.
బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు. మూఢనమ్మకాల నిర్మూలన, గుడుంబా నియంత్రణకు పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో కృషి చేయాలన్నారు. మండలానికి ఒకరు చొప్పున దళిత దివ్యాంగులకు దళితబంధు పథకంలో ప్రాధాన్యత కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని కలెక్టర్ ఆదేశించారు. గుడుంబా, మనీ లాండరింగ్, వడ్డీ వ్యాపారురాలపై చర్యలు తీసుకోవాలని పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులకు సూచించారు. కమలాపురం, మంగపేట మండలాల్లో భూముల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను అట్రాసిటీ కమిటీ సభ్యులు సన్మానించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, ఎస్సీ వెల్ఫేర్ అధికారి పీ భాగ్యలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, అట్రాసిటీ కమిటీ సభ్యులు నక భిక్షపతి, జన్ను రవి, చుంచు రవి, రాసమల్ల సుకుమార్, మహేశ్‌నాయక్, తహసీల్దార్లు ఎం. శ్రీనివాస్, సంజీవ, రాజుకుమార్, ఎంపీడీవో ఇక్బాల్ హుస్సేన్ తదితరు లు పాల్గొన్నారు.
డిసెంబర్ 8 వరకు ఓటరు నమోదు
డిసెంబర్ 8వ తేదీ వరకు నూతన ఓటరు నమోదు, డ్రాఫ్ట్ జాబితాలో మార్పులకు అవకాశం ఉందని కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయ స్వీప్ కన్సల్టెంట్ భవానిశంకర్తో కలిసి ఓటరు జాబితాపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితాలోని అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదును www.nvsp.in, ceo.telangana.nic.in , Voter Help Line App ద్వారా ఆన్లైన్లో నమోదుకు అవకాశం ఉందన్నారు. నూతన దరఖాస్తులను డిసెంబర్ 26 వ తేదీలోపు పరిషరించాలని ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదుకు చేసుకునేలా ప్రచారం చేయాలని సూచించారు. జిల్లాలో ప్రతి డిగ్రీ కళాశాలలో ప్రత్యేక అధికారులతో ఓటరు నమోదు చేయించాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు, జిల్లా వైద్య శాఖ అధికారులు వారి వద్ద ఉన్న సెక్స్ వరర్లు, ట్రాన్స్ జెండర్ల జాబితాను జిల్లా సంక్షేమ అధికారికి అందజేయాలన్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం మూడు నెలలకు ఒకసారి చొప్పున ఓటరు నమోదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏవో భాసర్, డీడబ్ల్యూవో ప్రేమలత, డీపీఆర్వో రఫీఖ్, ఈడీఏ దేవేందర్, ఎన్నికల డీటీ విజయ్ పాల్గొన్నారు.