నమస్తే నెట్వర్క్, జనవరి 10: ముక్కోటి ఏకాదశి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. తెల్లవారుజా ము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆలయాలన్నీ కిటకిటలాడాయి. ఈ సందర్భం గా ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామి వారిని దర్శించు కోగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాయంపే టలోని శ్రీమత్స్యగిరిస్వామి, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలోని విష్ణు ఆలయం ఎదురుగా ప్రత్యేక వేదికపై శ్రీసీతారామచంద్రస్వామివార్లకు ఉత్సవ ప్రతిష్ఠాపన చేసి పురోహితులు కలకుంట్ల మేఘానాథాచార్యులు, ఆలయ అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యం లో లక్ష తులసి అర్చన నిర్వహించారు.
ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఏకాదశి వ్రతాన్ని అనుసరించి విష్ణునామ పారాయణం చేశారు. వరంగల్ బట్టలబజార్లోని బాలానగర్ శ్రీవేంకటేశ్వరాలయానికి ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం క్యూ కట్టారు. ఆలయ ప్రాంగణమంతా గోవిందనామస్మరణతో మార్మోగింది. వరంగల్లోని గోవిందరాజ స్వామి, పాలకుర్తి మండలంలోని వల్మిడిలోని రామాలయం, సోమేశ్వరాలయం, చిల్పూరు మండలంలోని బుగులు వేంకటేశ్వరస్వామి, గీసుగొండ మండలం కొమ్మాల శ్రీలక్ష్మీనర్సింహస్వామి, నర్సంపేటలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు.