హనుమకొండ, సెప్టెంబర్ 22: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవ, మంగళవాయిద్యసేవ ధ్వజారోహరణ నిర్వహించి గణపతిపూజ, నవగ్రహారాదన, మంటపారాదన, ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన, కలుషస్థాపన, అంకురారోపన, మూలమంత్రయుక్తంగా అమ్మవారికి పూజలనంతరం బాలాత్రిపురసుందరీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో 10 రోజుల పాటు దేవీశరన్నవరాత్రుల ముఖ్యదాత స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి-నీలిమ దంపతులు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్థానిక కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు పాల్గొని దేవీనవరాత్రి మహోత్సవాలు జ్యోతిప్రజ్వలన గావించి ప్రారంభించారు.
సీఎంఆర్ గ్రూప్స్షాపింగ్మాల్చే వేలాది మంది భక్తులకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని బీజేపీ మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ప్రారంభించారు. 21న రాధేశ్యాం సాహితి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పాటల పోటీల్లో పాల్గొన్న 200 మంది మహిళలకు చీరలను అందించారు. ప్రథమ బమతి బక్కి దివ్య, ద్వితీయ బమతి జి.జ్యోతి, తృతీయ బమతి సరోజనకు అందించారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ వేయిస్తంభాల దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
కేంద్రపురావస్తుశాఖ సిబ్బంది కొంతమంది ఉత్సవ నిర్వహణకు అడ్డంకులు సృష్టించారని, పురావస్తుశాఖ డైరెక్టర్ జనరల్ అనుమతితో ఉత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా దేవీనవరాత్రి ఉత్సవాలు జరిపే మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని భక్తిప్రవృత్తులతో భక్తులంతా అమ్మవారి నవరాత్రులు నిర్వర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు కోన శ్రీకర్, పులి రజినీకాంత్, తోట పవన్, కుమార్‌యాదవ్, మాజీ కార్పొరేటర్ దొంతి కుమారస్వామి పాల్గొన్నారు.