ములుగు, నవంబర్15(నమస్తేతెలంగాణ) : నిబంధనలు పాటించాల్సిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో పలువురి గృహాలకు నష్టం వాటిల్లుతున్నది. ఇందుకు నిదర్శనమే ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డు విస్తరణ పనులను ఉదహరించవచ్చు. ప్రభుత్వ దవాఖాన ఎదురుగా ఉన్న బండారుపల్లి రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం రూ.6 కోట్ల నిధులతో ప్రణాళికలు రూపొందించింది.
గత సెప్టెంబర్ 12న మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ జిల్లా కలెక్టర్‌తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయి తే అధికారులు రోడ్డు సెంటర్ లేన్ నుంచి రెండు వైపులా సమానంగా విస్తరించాల్సి ఉంది. అయితే పక్షపాత దోరణితో కుడి వైపు 40 ఫీట్ల మేరకు, ఎడమ వైపు 45 ఫీట్ల వరకు విస్తరింపచేసేలా మార్కింగ్ చేశారు. ములుగు నుంచి బండారుపల్లికి వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ పనులను శుక్రవారం నుంచి ప్రారంభించారు.
మార్కింగ్ చేసినప్పుడే రెండు వైపులా సమానంగా చేపట్టకుండా తమ వైపు ఎక్కువ ఫీట్లు తీయడం ఏమిటని ఎడమ వైపున ఉన్న ఇండ్ల యజమాను లు అభ్యంతరం తెలిపారు. అయితే అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వ భవనాలున్న వైపు 40 ఫీట్లు మాత్రమే విస్తరింపజేస్తామని చెప్పడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైసాపైపా కూడబెట్టుకొని కట్టుకున్న త మ భవనాలను 45 ఫీట్ల మార్కింగ్‌తో కూల్చివేయాల్సి వస్తున్నదని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు ఓ న్యాయం, ప్రజల ఆస్తులకు మరో న్యాయమా అని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు ఒకేలా ఉండాలని కోరుతున్నారు.