వరంగల్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టే మంత్రి కొండా సురేఖ తీరు ఉన్నదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ‘మొంథా’ తుఫాన్ వరంగల్ ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేస్తున్నది. బుధవారం ఉదయం నుంచి గంట గంటకు పెరుగుతూ రాత్రి వరకు మొంథా మొత్తం వరంగల్ మహానగరాన్ని ఆవహించింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదైంది. మంగళవారం రాత్రి వాతావరణ శాఖ హెచ్చరికతో సెలవు ప్రకటించాల్సిన జిల్లా యంత్రాగం కనీసం తీవ్రతను గమనించి బుధవారం మధ్యాహ్నమే సెలవు ప్రకటించింది. అయితే, జిల్లాలోని ప్రయివేట్ పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలు ‘సెలవు’ ప్రకటనకు ‘ఛల్’మన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది.
అయితే, తుఫాన్ మాట విన్నా.. భారీ వర్షసూచన అనే మాట వినిపిస్తే వరంగల్ మహానగరం గుండెలో వరద పడ్డట్టు అయితది. చుట్టూ వరదలు ముంచెత్తుతుంటే మంత్రి కొండా సురేఖ తన నియోజకవర్గమైన వరంగల్ తుర్పు నియోజకవర్గంపై హన్మకొండలోని ఆర్అండ్బీ అతిథి గృహంతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి నగర మేయర్ గుండు సుధారాణి, వరద సహాయక చర్యలపై తన అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన మున్సిపల్ కమిషనర్, ఎంహెచ్వో, కుడా సహా సమస్త అధికార యంత్రాంగం మంత్రి సమీక్షలో నిమగ్నమైపోయారు. అయితే, నగరం అతలాకుతలం అవుతుంటే వాతావరణ శాఖ హెచ్చరికలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమీక్షను వాయిదా వేయాలని కోరాల్సిన అధికారగణం గంటల తరబడి సమీక్షలో ఉండిపోయారు. ఆ సమీక్ష సాయంత్రం 5 గంటల దాకా కొనసాగింది.
చరిత్రలో మునుపెన్నడూలేనంతగా సముద్రతీర దృశ్యాన్ని వరంగల్ జిల్లా ఆవహించింది. తుఫాన్లు సముద్ర తీర ప్రాంతాల్లో రోజంతా ఎడతెరపిలేని, ‘మొంథా’పోత.. కుండపోతను తలదన్నే వాతావరణం వరంగల్లో చుట్టేసింది. తీర ప్రాంతాల్లో వాన తీవ్రతతో కంటికి కనీసం 10 మీటర్ల మేర అయినా ఏమున్నదో కనిపించదు. అలాంటి వాతావరణమే బుధవారం వరంగల్లో నెలకొన్నది. దీంతో రికార్డు స్థాయిలో వాన జిల్లాను ముంచెత్తింది. ఇటువంటి పరిస్థితుల్లో అటు మంత్రి, మేయర్ సహా అధికారులు సమీక్షలో చిక్కుకోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాన తీవ్రత, యంత్రాంగం సహాయక చర్యలను ‘అధికారికంగా’ తెలుసుకునేందుకు వెళితే మీడియాకు సైతం గంటల తరబడి నిరీక్షణే ఎదురుకావటం గమనార్హం.