బచ్చన్నపేట ఆగస్టు 22 : ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. సిపిఎం పార్టీ బచ్చన్నపేట మండల కమిటీ సమావేశం బండకింది బాల నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కనకా రెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుధ్యం లోపించి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ, సిసి రోడ్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించు కోకపోవడం దారుణం అన్నారు.
గ్రామాలలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక సమస్యల మీద సర్వే నిర్వహించామని తెలిపారు. గ్రామాలలో రైతులకు యూరియా కొరతతో అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే రైతులకు సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్, మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ , మండల కమిటీ సభ్యులు రావుల రవీందర్ రెడ్డి, బైరగొని బలరాములు, అన్నేబోయిన రాజు, గొల్లకొండ ఈదమ్మ, తదితరులు పాల్గొన్నారు.