హనుమకొండ, నవంబర్ 26 : కేసీఆర్ చేసిన దీక్షతో దేశమంతా కదిలిందని.. తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 29వ తేదీ చరిత్రాత్మకమైనదని దీక్షా దివస్ కార్యక్రమ హనుమకొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన దీక్షా దివస్ సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ర్టానికి దిక్సూచి ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ అని వాణీదేవి పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర ఎప్పటికీ చెరిగిపోదని, ఉద్యమ చరిత్రను భావితరాలకు అందించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎవ్వరి పుణ్యాన ఇచ్చింది కాదని 1200మంది బలిదానాలు, కొట్లాడి, పోరాడి సాధించుకున్నామని గుర్తుచేశారు. స్వరాష్ట్ర సాధనకు బీఆర్ఎస్ చేసిన కృషిని మరోసారి ప్రపంచానికి తెలియజెప్పాలన్నారు. ఉద్యమకారులను, పార్టీ శ్రేణులను కలుపుకొని ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.
ఆ రోజు ఉదయం 9.30గంటలకు అమవీరుల జంక్షన్ నుంచి బీఆర్ఎస్ ఆఫీసు వరకు ర్యాలీ ఉంటుందని, ఫొటో ఎగ్జిబిషన్ తర్వాత ఉద్యమకారులను సన్మానించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌బాబు, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డి, సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, లలితా యాదవ్, కార్పొరేటర్లు చెన్నం మధు, ఇండ్ల నాగేశ్వర్రావు, వరంగల్ పశ్చిమ నియోజకవర కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, పార్టీ సీనియర్ నాయకులు మేడిపల్లి శోభన్, నయీమొద్దిన్, జానకీరాములు, పోలపల్లి రామ్మూర్తి, వెంకన్న, రవీందర్రావు, చింతల యాదగిరితో పాటు జిల్లాలోని 14 మండలాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.