కురవి, అక్టోబర్ 7: రేవంత్‌రెడ్డి తాను సీఎం అనే విషయాన్ని మరచిపోయాడని, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాననుకొని ప్రవర్తిస్తూ చౌకబారు మాటలకు రోల్‌మోడల్‌గా మారాడని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ విమర్శించారు. కురవిలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత బలాన్ని చేకూర్చాలని ఇలవేల్పు వీరభద్రుడిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ముఖ్యమంత్రిగా ఉండి కళ్లు పీకుతా.. కొడుకుల్లారా.. గోలీలు ఆడుకుంటా.. ఇటువంటి చౌకబారు మాటలకు సీఎం రేవంత్ రోల్‌మోడల్‌గా నిలిచాడన్నారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం రోజురోజుకూ తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బీఆర్ఎస్, మాజీ సీఎం కేసీఆర్ ప్రాబల్యం తగ్గాలని రేవంత్‌రెడ్డి అపసోపాలు పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నిరోజులైనా కేసీఆర్‌ను మరిచిపోరనేది నిజం అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని.. కేసీఆర్‌ను తట్టుకోలేమని రేవంత్ శిఖండిల్లా మహిళా మంత్రులను ముందు పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. మహిళ అయి ఉండి.. సభ్యసమాజం తలదించుకునేలా మంత్రి కొండా సురేఖ మాట్లాడిన తీరు విచారకరమన్నారు.
నోటితో మాత్రమే అధికారంలోకి వచ్చాం.. అదే నోరుతో ఐదేండ్లు పాలిస్తామంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదన్నారు. వరంగల్ జిల్లా పోరుగల్లు.. ఎంతో ఘనచరిత్ర ఉందని, సమ్మక్క సారలమ్మ, రాణీ రుద్రమదేవి పుట్టిన గడ్డ ఇజ్జత్ తీయొద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలల్లో 10శాతం కూడా హామీలు అమలు చేయలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలనే తపనతో పాలన సాగించారన్నారు.
గతంలో బతుకమ్మ చీరలు చౌకబారువన్నరు.. మీరు ఇంక మంచి చీరలు ఇవ్వండి. రూ. 500 ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. రైతుకు కాలానికనుగుణంగా రైతుబంధు ఇవ్వాలని, ఎన్నికలు వచ్చినప్పుడు కాదన్నారు. రైతు బంధు, రైతు రుణమాఫీ, నెలకు రూ. 2500.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు అమలు కావడం లేదన్నారు. పరిపాలనను గాలికి వదిలేస్తే మిమ్మల్ని ప్రజలు వదలిపెట్టరన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడన్నారు.
ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్‌ను దక్కించుకోవడానికి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజలు నష్టపోతే వారి తరపున పోరాడేందుకు బీఆర్ఎస్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ముందుగా ఇటీవల మృతి చెందిన నూకల నరేశ్‌రెడ్డిని గుర్తు చేసుకుని సంతాపం తెలియజేశారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, నూతక్కి నర్సింహారావు, ఐలి నరహరి, బోడ శ్రీను, గుగులోత్ నెహ్రూ, పద్మ, మన్యు ప్యాట్నీ, బాదె నాగయ్య, కిషన్‌నాయక్, సూరయ్య, శ్రీనివాస్, భద్రు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.