మహబూబాబాద్ రూరల్, నవంబర్ 20 : సీఎం సొంత నియోజకవర్గం లగచర్ల గిరిజన రైతులపై పెట్టిన కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌లతో కలిసి వారు మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత ప్రయోజనం కోసం కావాలనే లగచర్లలో ఫార్మా కంపెనీ పెట్టేందుకు సిద్ధమయ్యారని, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న తమ పట్టా భూములను గిరిజన రైతులు ఎనిమిది నెలల నుంచి ఇవ్వబోమని చెప్పిన కూడా వారిని బలవంతం చేయడం తగదన్నారు.
అక్కడి కాంగ్రెస్ నాయకులు రౌడీల్లాగా వ్యవహరిస్తూ అమాయకులైన గిరిజన రైతుల ఇండ్లలోకి వెళ్లి దౌర్జన్యంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. లగచర్ల రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుందన్నారు. లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ, మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ సందర్భంగా లగచర్ల రైతులకు న్యాయం కోసం అలాగే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మానుకోట జిల్లాలో కేటీఆర్ మహాధర్నాకు సిద్ధమైనట్లు తెలిపారు.
మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. అలాగే బీఆర్ఎస్ను మొలకెత్తనియ్యను అంటూ అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడని తెలంగాణ రాష్ట్ర సాధనలో, గత పదేళ్ల అభివృద్ధిలోనూ కేసీఆర్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు.
తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ చరిత్రలో ఉంటారని అది రేవంత్‌రెడ్డి గమనించి మాట్లాడాలని హితవు పలికారు. లగచర్ల గిరిజన రైతులకు న్యాయం జరిగేవరకూ బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, ఎండీ ఫరీద్, భరత్‌కుమార్‌రెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, మంగళంపల్లి కన్న, జేరిపోతుల వెంకన్న, రవికుమార్, ముత్యం వెంకన్న పాల్గొన్నారు.