మహబూబాబాద్ : రక్తదానం మహా ప్రాణదానం వంటిదని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని సుశ్రుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరై సంగీత దర్శకుడు చక్రి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చక్రి మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో అనేక సంగీత కార్యక్రమాలను నిర్వహించి యువతకు స్ఫూర్తిని నింపారన్నారు.
ఆయన అకాల మరణం ఈ ప్రాంత వాసులకు తీరని లోటని పేర్కొన్నారు. చక్రి గతంలో విద్యా భారతి వంటి అనేక స్కూళ్లలో విద్యార్థులకు పాటలు వృద్ధాలను నేర్పించారని, ఈ ప్రాంతంలో చక్రి జన్మించటం ఇక్కడి పట్టణ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. నేటి యువత ఆయన ఆశయాలను సాధించే విధంగా కృషి చేయాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో సుశ్రుత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రవీందర్రావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, మంగళంపల్లి కన్న, జీరిపోతుల వెంకన్న, కరుణాకర్ రెడ్డి, ఎడ్ల వేణుమాధవ్, అంబరీష, తదితరులు పాల్గొన్నారు.