మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 25 : అకాల వర్షంతో జిల్లా అతలాకుతలమైతే కాం గ్రెస్ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడం మరిచిందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. శుక్రవారం మహబూబాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు రైతుభరోసాను ఎగ్గొట్టిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఎకరాకు రూ. 15 వేల రైతుబంధు ఇస్తామని, క్వింటా వడ్లకు రూ. 500 బోనస్ అని అధికారంలోకి వచ్చినంక సన్నాలకే ఇస్తామని చెప్పి రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేశారన్నారు.
ఖరీఫ్‌లో పంట కోత దశకు వచ్చినా రైతుబంధు ఇవ్వ లేదన్నారు. ఇప్పటికీ ఎక్కడా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించ లేదన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం నిరుపేదలను భయభ్రాంతులకు గురి చేస్తున్నదన్నారు. మొదటగా పంటలకు ఉపయోగ పడే చెరువులు, కుంటను సర్వే చేయించి వాటిని అభివృద్ధి చేయాలని, పేదల ఇండ్లను కూల్చడం బంద్ చేయాలన్నారు. రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం అస్తవ్యస్తంగా మారిందన్నారు. విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్లు అందక ఇబ్బంది పడుతున్నారని, గ్రామాల్లో పారిశుధ్య పనులు అసలే చేయించడం లేదన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడుతున్నదన్నారు.
గిరిజన జిల్లాను ఇన్చార్జి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే కలిసి అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం పట్టణంలో వెజ్ నాన్‌వెజ్ మార్కెట్‌ను కట్టించిందని, కలెక్టర్ వెంటనే ప్రారంభించి లబ్ధిదారులకు అందించాలన్నారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఆగిపోయిందని, రూ. రెండు లక్షల రుణమాఫీ గ్రామాల్లో 40 శాతం మాత్రమే పూర్తయ్యిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, మంగళంపల్లి కన్న, ఎడ్ల వేణు, తేళ్ల శ్రీను, జేరిపోతుల వెంకన్న, కరుణాకర్ రెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు.