హనుమకొండ, ఏప్రిల్ 24: ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ చరిత్రలో నిలుస్తుంది. తెలంగాణ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ ప్రస్తావన లేకుండా తెలంగాణ ఉండదు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఓరుగల్లు గడ్డ మీద నుండి ఆ మహనీయుడిని తలుచుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. వారు తెలంగాణ భావజాలాన్ని బతికించి అందిస్తే ఆయన ఉద్యమ స్ఫూర్తిని కేసీఆర్ కొనసాగించి రాష్ట్రాన్ని సాధించి తన దక్షతను చాటుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా ఏనుగుల రాకేష్‌రెడ్డి రూపిందించిన ‘ఎగిసెర బలే ఎగిసెర సారే రావాలంటూ ఓరుగల్లు పిలిచెర’ అనే పాట సడీ ఆవిష్కరణ కార్యక్రమం హనుమకొండ సుబేదారిలోని ఎస్ఆర్ కన్వెన్షన్‌లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ పాట సీడీని ఆవిష్కరించారు. అలాగే రిటైర్డ్ తహసిల్దార్ మమహద్ సిరాజుద్దీన్ రచించిన పాటను సైతం ఆవిష్కరించి రాకేష్‌రెడ్డిని, సిరాజోద్దిన్లను అభినందించారు. ఈ సంరర్భంగా కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ 14ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విలసిల్లచేసి, దేశంలో నెంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టిందన్నారు.
2001లో కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టిన తర్వాత మన యాసను సగర్వంగా మైకుల ముందు మాట్లాడే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
సభను విజయవంతం చేయడంకోసం సోదరుడు రాకేష్ రెడ్డి ముందుపడి ఇంతటి మంచి పాటను గొప్పగా పాటను రూపొందించడం చాలా సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో భారత జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్ భాస్కర్, రజనీ సాయిచంద్, గాయకుడు మానుకోట ప్రసాద్, పద్మశ్రీ అవార్డు గ్రహిత గడ్డం సమ్మయ్య, సిరికొండ ప్రశాంత్, కవి ఎంబా సిరాజొద్దిన్ పాల్గొన్నారు.