ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మధ్య దూరం క్రమంగా పెరుగుతున్నది. ప్రభుత్వ పనులకు నిధుల కేటాయింపు, సొంత నియోజకవర్గంలో ఇతరుల జోక్యం, పార్టీలో కొత్త వాళ్ల పెత్తనంపై ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది గుంభనంగా ఉంటున్నా సీఎంపై ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే నిరసన తెలిపారు.
ముఖ్యమంత్రిని నేరుగా కలిసే ప్రయత్నం చేయకపోగా, జిల్లా పర్యటనకు వచ్చినా వెళ్లి కలవడం లేదు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మొదటి నుంచీ రేవంత్‌రెడ్డికి దూరంగా ఉంటుండగా, ఇప్పుడు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అదే దారిలో వెళ్తున్నారు. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం హనుమకొండకు రాగా, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నాయిని ఆయనను కలుసుకోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరిద్దరూ సీఎంకు దూరంగా ఉంటున్నారని వారి అనుచరులు చెప్పడం గమనార్హం.
– వరంగల్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉమ్మడి జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో మంత్రి కొండా సురేఖ జోక్యంపై ఆయా ఎమ్మెల్యేలు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. ఆయన కలవకపోవడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై పార్టీ, ప్రభుత్వ పరంగా ఎలాంటి తదుపరి చర్యలు లేవు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పలువురు అధికార పార్టీ నాయకులకు నామినేటెడ్ పోస్టుల ప్రతిపాదనలను ముఖ్యమంత్రి పరిగణనలోకి తీసుకోలేదని తేలింది. అభివృద్ధి పనుల విషయంలోనూ ఇదే జరిగిందని సమాచారం. కాంగ్రెస్‌లో మొదటి నుంచి ఉంటున్న తమను కాకుండా అసెంబ్లీ ఎన్నికలకు వారం ముందు పార్టీలో చేరిన వారికి, ఓ కేసులో తనతో ఉన్న నాయకుడికి సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని నాయిని అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం సీఎం పర్యటనకు దూరంగా ఉన్నట్లు తెలిసింది.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీఎం పర్యటనలకు మొదటి నుంచి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవుల కేటాయింపులో పార్టీలో సీనియర్లకు అన్యాయం జరిగిందని ఆయన అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, కొత్తగా వచ్చిన వారికి కీలక పదవులు ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంతోనే రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనను కలవలేదని దొంతి సన్నిహితులు చెబుతున్నారు.
జూన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ నగర పర్యటనకు రాగా మాధవరెడ్డి పాల్గొనలేదు. ఆ తర్వాత అధిక వానలతో నష్టం జరిగిన మహబూబాబాద్ జిల్లాలో సీఎం పర్యటించారు. వానల కారణంగా హెలికాప్టర్ ప్రయాణం వీలుకాకపోవడంతో మహబూబాబాద్, నర్సంపేట, వరంగల్ మీదుగా రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్లారు. నర్సంపేటలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముందు నుంచే సీఎం హైదరాబాద్‌కు వెళ్లగా నర్సంపేటలోనే ఉన్న ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆయనకు స్వాగతం పలకలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో విధాన నిర్ణయాలపై అసంతృప్తి కారణంగానే మాధవరెడ్డి దూరంగా ఉంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాకముందే ఇలా ఉంటే, మరో నాలుగేండ్లు గడిచే సరికి ఇంకెంత మంది దూరమవుతారో అని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది.