మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు ఆగడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సురేఖ వ్యవహారశైలిపై ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు పలుమార్లు పీసీసీకి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. నెల క్రితం రెండు వర్గాల పరస్పర ఫిర్యాదులు, ప్రకటనలు, వివరణలతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలోని పంచాయితీలు మరోసారి బహిర్గతమయ్యాయి. పీసీసీ నాయకత్వం జోక్యం చేసుకుని సర్దిచెప్పినట్లు ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలని సూచించింది. అయితే ఇవన్నీ జరిగిన వారం రోజుల్లోనే పాత తరహాలోనే మంత్రి సురేఖకు, మెజార్టీ ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న విభేదాలు బయటపడగా ఈసారి ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తాకింది.
– హనుమకొండ, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
స్థానిక ఎన్నికల తరుణంలో విభేదాలు పక్కనబెట్టి కలిసి పనిచేయాలని అధిష్టానం ఇటీవలే మంత్రి కొండా సురేఖకు, ఆమెను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలకు ఉపదేశించింది. పీసీసీ నాయకత్వం చెప్పినప్పుడు సరేనని చెప్పిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తమదైన శైలిలో గ్రూపులను అలాగే కొనసాగిస్తున్నారు. గతంలో మాదిరిగా మంత్రికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు, ముఖ్యంగా మంత్రులు పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
మంత్రి సురేఖ వ్యవహార శైలిపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి ఏడాదిగా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో మెజార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. క్షేత్రస్థాయిలోని విషయాలు, పార్టీ బాగు కోసం చేసే సూచనలను పీసీసీ నాయకత్వం పట్టించుకోనప్పుడు తామే సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తున్నదని చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలోని అన్ని అంశాలను చక్కదిద్దాల్సిన ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపైనా ఈ విషయంలో మెజార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉంటున్నారు. మంత్రి సురేఖ ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీపరంగా గ్రూపు రాజకీయాలకు కారణమవుతున్న తీరుపైనా ఇన్చార్జి మంత్రి స్పందించకపోవడం సరికాదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొత్త రకంగా..
ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న చో ట మెజార్టీ ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. హనుమకొండలో జరిగిన వేడుకల్లో మంత్రి కొండా సురేఖ ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. కానీ హనుమకొండ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలెవరూ ఈ కార్యక్రమానికి రాలేదు. మొదటినుంచీ సురేఖను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు నాయిని, కడియం పాల్గొనకపోగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు హనుమకొండలో కాకుం డా వరంగల్ జిల్లా వేడుకల్లో పాల్గొన్నారు.
వరంగల్‌లో వేడుకలకు ఇన్చార్జి మంత్రి పొంగులేటి హాజరుకాగా జిల్లా పరిధిలోని అధికార పార్టీకి చెందిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే మా మిడాల యశస్వినీరెడ్డి ఈ వేడుకలకు హాజరుకాలే దు. ఇద్దరు మంత్రులపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు తాము ప్రాతినిధ్యం వహించే ఇతర జిల్లా కేంద్రాల్లోనూ స్వాతంత్య్ర వేడుకలకు దూరంగానే ఉన్నారు.
జనగామ జిల్లాకేంద్రంలోని వేడుకలకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ముఖ్యఅతిథిగా హాజరైతే ఈ జిల్లా పరిధిలోని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడి యం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి సైతం దూరంగా ఉన్నారు. మంత్రులు కొం డా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై వీరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికార కార్యక్రమాలకు హాజరుకాకపోవడం హస్తం పార్టీలో చర్చనీయాంశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారే వ్యవహరిస్తే తమ పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ శ్రేణులు వాపోతున్నాయి.