వరంగల్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్‌లో మంత్రి సురేఖ, ఎమ్మెల్యేల మధ్య పంచాయితీ ఆగకుండా సాగుతూనే ఉన్న ది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఈ పంచాయితీని పీసీసీ నాయకత్వం సైతం పరిష్కరించలేకపోతున్నది. మంత్రి కొండా సురేఖ, ఇతర ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరుకు పరిష్కారం చూపకుండా కాలయాపన చేస్తున్నది. ఎవరిపైనా చర్య లు లేకుండా, వివరణ తీసుకోకుండా మరోసారి వాయిదా పద్ధతిని ఎంపిక చేసుకున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మధ్య పంచాయితీని పరిష్కరించేందుకు సీనియర్ నేతలతో మరో కమిటీని ఏర్పాటు చేయాలని పీసీసీ క్రమశిక్షణ సంఘం ప్రతిపాదించింది.
మంత్రి సురేఖ, ఉమ్మడి జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేల మధ్య కొత్తగా పంచాయితీలు రాకుండా కొ త్త కమిటీ చూసుకోవాలని పేర్కొన్నది. స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం నేపథ్యం లో సత్వరం మరో కమిటీని ఏర్పాటు చేసేందుకు పీసీసీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నది. క్రమశిక్షణ సంఘం ప్రతిపాదనలు, పీసీసీ నాయకత్వం ఉదాసీన వైఖరిపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నష్టం చేసేలా వ్యవహరిస్తున్న మంత్రి కొండా సురేఖకు కనీస హెచ్చరిక చేయకపోవడం సరికాదని అంటున్నారు. పీసీసీ నాయకత్వ వైఖరి ఇలాగే ఉంటే ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో స్థానిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండుమూడు నెలల నుంచే మంత్రులు కొండా సురే ఖ, సీతక్క మధ్య విభేదాలు మొదలయ్యాయి. మంత్రి సురేఖకు, ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ ఎమ్మెల్యేలకు మధ్య ఇదే పరిస్థితి నెలకొన్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ విభేదాలు మరింత ముదిరి పంచాయితీల వరకు వెళ్లిం ది. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ సమావేశాల్లో కాంగ్రెస్‌లోని వర్గపోరు తరచూ బయటపడుతూనే ఉండగా, గత నెలలో ఫిర్యాదుల వరకు వెళ్లింది.
ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరా వు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మ న్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కలిసి మంత్రి సురేఖపై ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రి సురేఖ, ఆమె భర్త మురళీధర్‌రావు ఉమ్మడి జి ల్లా ఇన్చ్జా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డిపై ఫిర్యాదుతోపాటు బహిరంగంగా విమర్శలు చేశారు.
పరస్పర ఫిర్యాదులు, విమర్శలు, ఆరోపణలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ వర్గ పోరు పతాక స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వద్దకు ఈ ఫిర్యాదులు వెళ్లాయి. పీసీసీ ఆదేశాల మేరకు క్రమశిక్షణ కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రి, ఎమ్మెల్యేల మధ్య పంచాయితీపై విచారణ చేపట్టి రెండు వర్గాల అభిప్రాయాలు సేకరించింది. వాదనలు విన్నాక ఏం చేయాలో తెలియక అయోమయంలో పడింది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ నుంచి ఏదైనా నిర్ణయం వస్తుందని ఎదురుచూసిన ఎమ్మెల్యేలకు నిరాశే మిగలగా, పీసీసీ కొత్తగా నియమించే సమన్వయ కమిటీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.