రాయపర్తి : రాష్ట్రంలోని రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తెలిపారు. మండలంలోని జగన్నాధపల్లి గ్రామంలో రూ.1.50 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 33/11 కె.వి విద్యుత్ ఉపకేంద్రం పనులకు ఆమె విద్యుత్ శాఖ అధికారులతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే విద్యుత్ గృహ వినియోగదారులకు గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటును అందజేస్తున్నట్లు ఆమె చెప్పారు.
జగన్నాధపల్లిలో విద్యుత్ సబ్స్టేషన్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ణు ఆదేశించారు. ఆమె వెంట పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి, తహసిల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, ఎంపీడీవో గుగులోతు కిష నాయక్, విద్యుత్ శాఖ ఏఈ పెద్ది రవళి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జాటోత్ హామ్యా నాయక్, ఈదులకంటి రవీందర్ రెడ్డి, బిల్లా సుధీర్ రెడ్డి, నంగునూరి అశోక్ కుమార్, శారద, సరికొండ కృష్ణారెడ్డి, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, నయీం తదితులున్నారు.