హుస్నాబాద్, నవంబర్ 8 : హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్ నామినేషన్ కార్యక్రమం బుధవారం అట్టాహాసంగా జరిగింది. ఉదయం తన స్వగ్రామంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం హుస్నాబాద్‌లోని శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయంలో సతీమణి డాక్టర్ షమిత, తల్లి సరోజినీదేవి, కుమారుడు ఇంద్రనీల్‌బాబు, కుటుంబ సభ్యులు, బంధువులు, ముఖ్య నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చెంతన పెట్టిన నామినేషన్ పత్రాలను పూజల అనంతరం పూజారులు ఎమ్మెల్యే చేతికి అందించారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో తన తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఏడు మండలాల నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు తరలివచ్చారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీచౌక్, మల్లెచెట్టు చౌరస్తా, మెయిన్‌రోడ్డు ద్వారా అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ర్యాలీలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్ర శ్రీహరి, యూత్ నాయకుడు వొడితెల ఇంద్రనీల్‌బాబు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. డప్పుల చప్పు ళ్లు, మహిళల నృత్యాలు, జై తెలంగాణ, జై కేసీఆర్, జై సతీశన్న నినాదాలతో హుస్నాబాద్ పట్టణ మార్మోగింది. మధ్యాహ్నం 12.30గంటలకు ఐవోసీ భవనంలోని ఆర్వో కార్యాలయంలో ఎమ్మెల్యే తన నామినేషన్‌ను దాఖలు చేశారు. కార్యక్రమంలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ కూతురు డాక్టర్ పూజిత నామినేషన్ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తండ్రి నామినేషన్ కార్యక్రమానికి హాజరై ర్యాలీలో పాల్గొని యువతులు, మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. మహిళలతో కలిసి నృత్యం చేశారు. సతీశ్‌కుమార్ తల్లి సరోజినీదేవి సైతం మహిళలతో కలిసి నృత్యం చేశారు. కుమారుడు ఇంద్రనీల్‌బాబు కూడా యువతతో కలిసి నడుస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.