ఖానాపురం, నవంబర్ 16: నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే గిరిజనేతర రైతులకు పోడు పట్టాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని చిలుకమ్మనగర్, కీర్యాతండా, దబీర్‌పేట, చిలుకమ్మతండా, పర్షాతండా, అయోధ్యనగర్, అశోక్‌నగర్, మనుబోతులగడ్డ, బండమీదిమామిడితండా, పెద్దమ్మగడ్డ, ఖానాపురంలో ఆయన గురువారం రెండో విడుత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దికి ప్రతి గ్రామంలో మహిళలు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. డప్పుచప్పుళ్లు, పటాకుల మోతతో గ్రామాలన్నీ మార్మోగాయి. సుదర్శన్‌రెడ్డి ప్రచారంతో గ్రామాలన్నీ గులాబీమయమయ్యాయి. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో కరెంటు కోతలు, నీళ్లు లేక పంటలు ఎండిపోయాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటలు కరెంటు ఇవ్వడమే కాకుండా పుష్కలంగా నీటి వనరులను కల్పించిందని స్పష్టం చేశారు. అంతేకాకుండా రైతు సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్నదని తెలిపారు. తనను నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి గెలిపించినందుకే 60 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా పాకాలకు గోదావరి జలాలను తీసుకొచ్చానన్నారు.
మళ్లీ గెలిపిస్తే దబీర్‌పేట, చిలుకమ్మనగర్, కీర్యాతండా, చిలుకమ్మతండా, ఉమ్మడి మంగళవారిపేట భూములకు పాకాల జలాలను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. దీంతోపాటు అసైన్డ్ భూములకు పట్టాలు ఇప్పించి క్రయవిక్రయాలు చేసుకునే అవకాశం కల్పిస్తానన్నారు. వంద ఏళ్ల వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా పంట కాల్వలను ఆధునీకరిస్తామని చెప్పారు. తాను చేసిన అభివృద్ధి గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తున్నదని, ఓట్లలో చీలికొద్దని, పనుల చేసే వాళ్లకే గంపగుత్తగా ఓట్లు వేయాలని అభ్యర్థించారు. తనను ఓడించేందుకు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దొంతి, రేవూరి వేర్వేరు పార్టీల్లో ఉండి కుట్ర పన్నారని, ఈసారి కూడా ఇద్దరు ఒక్కటవుతున్నారని, ప్రజలు కాంగ్రెస్ కుట్రలను గమనించాలని ఎమ్మెల్యే పెద్ది కోరారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, మండల ఇన్చార్జి డాక్టర్ రాణాప్రతాప్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు నీలమ్మ, హఠ్య, సునీత, వెంకన్న, అశోక, కవిత, రవి, సోమయ్య, లక్ష్మి, వైస్ ఎంపీపీ ఉమారాణి, ఉపేందర్‌రెడ్డి, శైలజ, అన్నం నిర్మల, కిషన్‌రావు, శ్రీను, వెంకటేశ్, ఎంపీటీసీ భట్టు శంకర్, కవిత పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన చాలా మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గుర్రాలగండిరాజపల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది యువకులు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, సర్పంచ్ తుత్తూరు కోమల-రమేశ్, పార్టీ గ్రామ బాధ్యులు కుమారస్వామి, రవీందర్, శ్రీశైలం, వెంకటేశ్, బాలరాజు పాల్గొన్నారు. అదేవిధంగా పర్శనాయక్‌తండాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో నాయకులు కొర్ర రాంలాల్, అజ్మీరా మేగ్యానాయక్, రమేశ్ పాల్గొన్నారు.