నర్సంపేట, జూన్ 13: సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నారని, మహిళలకు అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో మంగళవారం సంక్షేమ పథకాల అమలుపై మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కల్యాణలక్ష్మి పథకం పుట్టిందే నర్సంపేట నుంచి అన్నారు. ఈ పథకంలో ప్రతి ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహిళల్లో చైతన్యం నర్సంపేటలో ఉందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా 8 వేల మంది మహిళలు క్రీడోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని గుర్తుచేశారు. క్రీడలతో మహిళలు స్ఫూర్తి పొందాలన్నారు. స్వయంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ క్రీడోత్సవాలను పరిశీలించారన్నారు. గత ఏడాది జరిగిన క్రీడోత్సవాల్లో మంత్రులు హరీశ్‌రావు, సత్యవతిరాథోడ్, ఎంపీ కవిత పాల్గొన్నారన్నారు. విద్యా రంగంలోనూ ప్రతిభ ఉన్న ఎంతో మంది యువతులు రాణిస్తున్నారని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘన త సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తద్వారా మహిళలు పురుషులతో సమానంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అయ్యే అవకాశం ఏర్పడిందని వివరించారు. రైతుల ఉత్పత్తులను కూడా మహిళలే కొనుగోలు చేసే స్థాయికి వచ్చారని తెలిపారు. మహిళలు మిర్చి కొనుగోలు చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎగుమతులు చేస్తున్నారని ఆయన వివరించారు. మార్కెంటింగ్లోనూ దేశంలోనే నర్సంపేట ప్రాంతం ముందున్నదన్నారు. రైతు సంఘాలను కూడా పూర్తిస్థాయిలో మహిళలతో ఏర్పాటు అయినట్లు తెలిపారు. మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లకు మహిళలకు కల్పించిందన్నారు. దీంతో మహిళలు కూడా ఉద్యోగాలు సాధించే స్థాయికి వచ్చిందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, జడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఆర్డీవో శ్రీనివాసులు, చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, ఏసీపీ సంపత్‌రావు, ఎంపీపీ ఊడుగుల సునీత, మోతె కళావతి, కాట్ల కోమల, జడ్పీటీసీ సుగుణ, కౌన్సిలర్లు రాయిడి కీర్తిదుశ్యంత్రెడ్డి, రామసహాయం శ్రీదేవి, బానాల ఇందిర, దార్ల రమాదేవి, సీడీపీవో రాధిక, నల్లా భారతి పాల్గొన్నారు.