జనగామరూరల్, జనవరి 20: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ మోసాలు, అబద్ధాలపై ప్రజల్లో చర్చ పెట్టాలని, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించాలని శ్రేణులకు పిలుపునిచ్చా రు. సోమవారం జనగామ మండలం యశ్వంతాపూర్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బచ్చన్నపేట, జనగామ మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన పల్లా మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలనను, ప్రస్తుత ప్రభుత్వ తీరును ప్రజలకు వివరించాలన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో అడగాలన్నారు.
గత ఎన్నికల్లో కాం గ్రెస్ ఇచ్చిన దొంగ హామీలకు మోసపోయి గోసపడుతున్నామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని, ప్రజలతో కలిసి పని చేయాలని, ప్రతి ఊరిలో గులా బీ నేతలను గెలిపించి బీఆర్ఎస్ సత్తా చాటాలన్నారు. ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి సగం మందికి కూడా ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఏడాదికి రెండుసార్లు ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుబంధును పంట సాగుకు ముందే అందించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నదన్నారు. బీఆర్ఎస్ పోరాట ఫలితంగానే రేషన్ కార్డుల జారీని నిరంతరం కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
మంత్రులంతా అబద్ధాలు అడుతున్నారని, 80 లక్షల మంది దరఖా స్తు చేసుకుంటే కేవలం 6 లక్షల మందికే కార్డులిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అర్హులకు రేషన్‌కార్డులు ఇవ్వకపోతే నిలదీస్తామని పల్లా హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయాసిద్దులు, బచ్చన్నపేట పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, వైస్ చైర్పర్సన్ మద్దికుంట రాధ, మాజీ ఎంపీపీ మేకల కళింగరాజు, బావండ్ల నాగజ్యోతీకృష్ణంరాజు, బచ్చన్నపేట సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీశ్‌రెడ్డి, ఎంపీటీసీల పోరం మండల మాజీ అధ్యక్షుడు దూడల కనకయ్యగౌడ్, నాయకులు చంద్రారెడ్డి, కొండి వెంకట్‌రెడ్డి, మల్లారెడ్డి, నరేందర్, ఉపేందర్‌రెడ్డి, గాడిపల్లి ప్రేమలతారెడ్డి, యాదగిరిగౌడ్, రామకృష్ణ, యాదగిరిరెడ్డి, సిద్ధారెడ్డి, కిష్టయ్య, ఫిరోజ్ పాల్గొన్నారు.