జనగామ చౌరస్తా, నవంబర్ 8 : సమాజంలో అత్యంత పేదరికం అనుభవిస్తున్న దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడంతో పా టు వారికి గౌరవప్రదమైన హోదా కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ పథకాన్ని కొనసాగించాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని ధర్మకంచ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఎస్సీ కార్పొరేషన్, గీతాచార్య ఫౌండేషన్ సంయుక్తంగా 50 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా భారత రాజ్యాం గ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకునే మరో 10 మంది మహిళలకు తన సొంత ఖర్చులతో కుట్టుమిషన్లు అందజేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, కౌన్సిలర్లు మల్లిగారి చంద్రకళారాజు, వాంకుడోత్ అనిత, బొట్ల శ్రీనివాస్, రాంచందర్, బీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షుడు ఉల్లెంగుల సందీప్, నాయకులు తిప్పారపు విజయ్, ప్రవీణ్ పాల్గొన్నారు.