జనగామ, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : ‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏమీ లేదని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించి ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వార్డుల వారీగా పార్టీ అభ్యర్థుల గెలుపుపై సమీక్షించారు. అధికార కాంగ్రెస్ రౌడీయిజం చేసి, ప్రజలను భయపెట్టి గెలవాలని చూస్తే విజ్ఞులైన జనగామ పట్టణ ప్రజలు తిప్పికొట్టబోతున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా మున్సిపాలిటీపై ఎగిరేది గులాబీ జెండేనని స్పష్టం చేశారు.
పట్టణంలోని మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని అన్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన జనగామ మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దింది కూడా బీఆర్ఎస్ అన్నారు. ఇప్పటికే బస్టాండ్ చౌరస్తా నుంచి నెహ్రూ పార్కు, సూర్యాపేట, సిద్ధిపేట, హైదరాబాద్, హనుమకొండ రోడ్డు విస్తరణ, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు, బతుకమ్మ కుంట పార్కు సుందరీకరణ, మినీ, ఇండోర్ స్టేడియం, సమీకృత రైతు బజార్, కలెక్టరేట్, మెడికల్ కాలేజీ తదితర అభివృద్ధి పనులు జరిగాయన్నారు.