హనుమకొండ, అక్టోబర్ 22: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వేయిస్తంభాల దేవాలయంలో జ్యోతి వెలిగించి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యే నాయిని దంపతులకు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికి రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందించి, ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్తీక మాసం అనేది శైవ భక్తులకే కాదు, ప్రతి హిందువుకూ ఒక పవిత్రమైన కాలం. పరమశివుని ఆరాధనకు ఈ మాసం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగిస్తూ, శివాలయాలకు వచ్చి పూజలు చేయాలని కోరుతున్నాను. మన సంస్కృతిని, సంప్రదాయాలను మరింత బలంగా నిలబెట్టే కార్యక్రమాల్లో ప్రతిఒక్కరు పాల్గొనాలని సూచించారు.
ఈ కార్తీక మాసం అందరికీ శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్తీక మాస పూజ కార్యక్రమాలకు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి అనిల్, ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, గంగు మణికంఠశర్మ, ప్రణవ్‌శర్మ, సందీప్‌శర్మ, సీనియర్ అసిస్టెంట్ గోధుమల ప్రేమ్‌కుమార్, సిబ్బంది రామకృష్ణ పాల్గొన్నారు.