హనుమకొండ, అక్టోబర్ 12: పోలియో బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహాశబరీష్, మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ 0-5 ఏళ్లలోపు పిల్లలకు పోలియోచుక్కలు వేయించాలని, పల్స్‌పోలియో కార్యక్రమం అనేది మన దేశ ఆరోగ్య రంగంలో ఎంతో ముఖ్యమైన కార్యక్రమన్నారు.
భారతదేశాన్ని పోలియోరహితంగా మార్చేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసికట్టుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మనం చిన్నారులకు జీవితాంతం ఆరోగ్యాన్ని అందించగలుగుతామని, తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలంటే ఈ రెండు చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఒక్కో కుటుంబం, ఒక్కో చిన్నారి కూడా ఈ కార్యక్రమం నుంచి మిగలకుండా ఉండాలన్నారు.
మన పిల్లల పట్ల ఇది మన బాధ్యత మాత్రమే కాదు ఒక సామాజిక బాధ్యత కూడా అని గుర్తుచేశారు.
ప్రభుత్వం, ఆరోగ్యశాఖ ఈ కార్యక్రమాన్ని ఎంతో విస్తృతంగా చేపడుతోందని, ప్రభుత్వ హాస్పిటల్స్, అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్స్, బస్స్టేషన్లు, కాలనీలు ఇలా ప్రతిచోట కూడా పోలియో బూత్‌లు ఏర్పాటు చేశారు. పోలియోని పూర్తిగా నిర్మూలించాలంటే మనం అందరం కలిసి పనిచేయాలన్నారు.
మెరుగైన వైద్యసేవలందించాలి..
అనంతరం జీఎంహెచ్లోని మెటర్నటి వార్డును సందర్శించి వైద్యులు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కావాల్సిన మౌలిక వసతులు, సదుపాయాల గురించి ఆరా తీశారు. దవాఖానకు వచ్చే గర్భిణీలకు, మహిళలకు మెరుగైన వైద్యసేవలందించాలని సూపరింటెండెంట్ విజయలక్ష్మీని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో అప్పయ్య, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.