హనుమకొండ, మే 20 : ఉద్యోగుల సమస్యల పరిష్కార విషయంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు నాకు బాధను కలిగించాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర పరిస్థితి బాగా లేదని అందులో భాగంగానే సీఎం ఉద్యోగుల విషయంలో మనసులో పెట్టుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడరని తెలిపారు. మంగళవారం హనుమకొండ వడ్డెపల్లి రోడ్ లోని టీఎస్ ఈఈయూ-327 కార్యాలయం(పల్లా రవీందర్రెడ్డి భవన్)లో జరిగిన శ్రమ శక్తి అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నెల రూ. 5,500కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. ఆర్థిక వనురులు పెంచుకోవడంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి తెలియని శక్తి ఐఎన్టియూసీ అని, 2024 ఎన్నికల్లో ఐఎన్టియూసీ కీలక పాత్రం పోశించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా చేసిందన్నారు. విద్యుత్తు ఉద్యోగుల సమస్యల పరిష్కారంకు సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్ ఈఈయూ)- 327 రాష్ర్ట సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ మాట్లాడుతూ టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కోలో ఇంచార్జి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే జెన్ కో, ట్రాన్స్ కోలో అనేక సమస్యలున్నాయని, ఇంచార్జి సీఎండీలతో ఇబ్బందులు తొలగడం లేదన్నారు. విద్యుత్ సంస్థల్లో డైరక్టర్స్ నియామకంలో జాప్యంతో పాలనాపరమైన ఇబ్బందులు కలుగుతున్నాయని వెంటనే డైరక్టర్ల నియామకాలు చేపట్టాలని ఆయన కోరారు.
అదే విధంగా విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఒక్క రూపాయి ఇవ్వలేమని మాట్లాడటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత సమయం ఆగండి ఆర్థిక పరిస్థితి మెరుగు పడ్డాక అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని అంటే చెపుతుంటే బాగుండేదన్నారు. సీఎం మాటాలతో ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుందని ఆయన పేర్కొన్నారు.