న్యూ శాయంపేట, డిసెంబర్ 24: క్రైస్తవ సోదరులు, ప్రజలు క్రిస్టమస్ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆకాంక్షించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. కాజీపేట ఫాతిమా కేథడ్రల్ చర్చిలో మేత్రాసనం పీఠాథిపతి బిషప్ ఉడుమల బాల సమక్షంలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ క్రిస్టమస్ పండుగ ప్రేమ, శాంతి, కరుణ, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
మతాల మధ్య ఐక్యత, సామరస్యమే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపని, ప్రజలంతా కలిసికట్టుగా పండుగలను జరుపు కోవడమే నిజమైన అభివృద్ధికి సంకేతమన్నారు. ఈ క్రిస్మస్ పండుగతో వరంగల్ పశ్చిమ ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, సమృద్ధి నిండాలని కోరుకుంటూ, ప్రతి ఇంటా ఆనందం వెల్లి విరియాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.