పోచమ్మమైదాన్, ఏప్రిల్ 20: మైనార్టీల సంక్షేమమే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ ధ్యేయమని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఎల్బీనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో దావత్-ఏ-ఇఫ్తార్‌ను నన్నపునేని ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లు ఎండీ పుర్ఖాన్, సురేశ్‌కుమార్ జోషి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని, ఇంకా చేయాల్సిన పనులకు నిధులు మంజూరైనట్లు చెప్పారు.
మైనార్టీల కోసం ఈ ప్రాంతంలో షాదీఖాన భవనం నిర్మిస్తున్నామని, ఇందులో పేద వర్గాలు ఉచితంగా శుభకార్యాలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే, దేశాయిపేటలో మైనార్టీ పిల్లల కోసం ప్రత్యేకంగా రెండు గురుకుల పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయని, ఇందులో పేద పిల్లలు ఉచితంగా విద్యను అభ్యసిస్తూ, కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడుతారని వివరించారు. నాడు అధ్వానంగా ఉన్న మండిబజార్ రోడ్డు ఇప్పుడు ఎలా తయారైందో ప్రజలే గుర్తించాలన్నారు. తాను మైనార్టీల సంక్షేమం కోసం పని చేస్తానని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లింల కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. అలాగే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు ఐక్యంగా ఉంటూ శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవడం మతసామరస్యానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా, ఎమ్మెల్యే నరేందర్, ఎంపీ దయాకర్‌తోపాటు మతపెద్దలు, కార్పొరేటర్లు, నాయకులు కలిసి ప్రార్థనలు చేశారు.
రంజాన్ పండుగ సందర్భంగా సర్వమత సమ్మేళన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే నరేందర్ రంజాన్ కిట్లు (పండుగ సామగ్రి) పంపిణీ చేశారు. ఎల్బీనగర్లో ట్రస్ట్ అధ్యక్షుడు ఎండీ నయీం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా వందలాది కుటుంబాలకు పండుగ సామగ్రి అందజేయడం అభినందనీయమన్నారు. ఈ ట్రస్ట్ నిర్వాహకులు కులమతాలకతీతంగా సాయం చేసేందుకు ముందుకు రావడం ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎండీ పుర్ఖాన్, సురేష్‌కుమార్ జోషి, మత పెద్దలు, ట్రస్ట్ ప్రతినిధులు అరుణ్ జేమ్స్, అన్సారీ, పల్లకొండ హరికుమార్, అమీర్‌పాషా, వాజీద్, కుమార్, అనిల్, సుభాని, రేష్మ, షబానా, రామగిరి మహేశ్ పాల్గొన్నారు.