పోచమ్మమైదాన్, జనవరి 22: వరంగల్ తూర్పులోని 12, 13 డివిజన్లలో ఉన్న దేశాయిపేటలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. దేశాయిపేటలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పర్యటించి, రూ. 11 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వాడవాడనా తిరిగి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రూ. 3,800 కోట్లతో మునుపెన్నడూ జరుగని అభివృద్ధి పనులు చేసి చూపించామని తెలిపారు. ఇందులో భాగంగా వెనుకబడిన ప్రాంతమైన దేశాయిపేటను అభివృద్ధి చేసుకోవడానికి రూ. 11 కోట్లతో పనులను ప్రారంభించకున్నామని చెప్పారు. వాడ వాడనా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టామని, ప్రతి కుల సంఘానికి తమ ఆత్మగౌరవం ఉట్టిపడేలా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించారు.
తూర్పు నియోజకవర్గంలో రూ. 1100 కోట్లతో మల్టీసూపర్స్పెషాలిటీ హాస్పిటల్, రూ. 75 కోట్లతో బస్‌స్టేషన్, కలెక్టరేట్, జిల్లా కేంద్రంతోపాటు మరెన్నో అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతీ యువకులకు తన సొంత ఖర్చుతో 110 రోజులు కోచింగ్‌తోపాటు భోజన సదుపాయం ఏర్పాటు చేసి, మెటీరియల్ అందజేశామని వివరించారు. కరోనా సమయంలో ఏ ఒక్క నాయకుడు బయటకు రాలేదని, తన సొంత ఖర్చుతో 25 వేల కుటుంబాలకు రేషన్ పంపిణీ చేశామని, ఇదే సమయంలో డివిజన్ నాయకుడు కావటి రాజు యాదవ్‌తోపాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులు ప్రజల వెంట ఉన్నారని వివరించారు.
దురదృష్టవశాత్తు కరోనా సమయంలో కార్పొరేటర్ కావటి కవిత భర్త రాజు దూరం కావడం, ప్రస్తుతం మన మధ్య లేకపోవడం బాధాకరమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తూర్పు నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కావటి కవితా రాజుయాదవ్, సురేష్‌కుమార్ జోషి, పలువురు నాయకులు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ముందుగా దేశాయిపేటకు విచ్చేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు కోలాటాలతో స్వాగతం పలికారు. ప్రతిసారిమాదిరిగానే స్థానిక బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. స్థానికులు తమ సమస్యలు పరిష్కారం అవుతున్నాయంటూ సంతోషంతో గొర్రెపిల్లలను నన్నపునేనికి అందజేశారు.
గిర్మాజీపేట: పద్మశాలీల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గతంలో నిధులు కేటాయించానని, మరిన్ని నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హామీ ఇచ్చారు. ఎస్‌ఆర్‌ఆర్‌తోట పద్మశాలి పరపతి సంఘం సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. సమావేశంలో కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ, బీఆర్ఎస్ నేత ముష్కమల్ల సుధాకర్, డివిజన్ అధ్యక్షుడు మీరిపెల్లి వినయ్‌కుమార్ పాల్గొన్నారు.