ఐనవోలు, సెప్టెంబర్ 30 : వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వివాదాస్పద వ్యాఖ్య లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలు స్తున్నారు. హైదరాబాద్లో ఇటీవల మాల ఉద్యోగ సంఘం సమావేశంలో తమ సామాజిక వర్గానికి చెందిన వారిపైన వివాదా స్పద వ్యాఖ్యలు చేశారని మాదిగల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ వివాదానికి తెర పడక ముందే నాగరాజు సోమవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కేంద్రంలోని కసూర్బాగాంధీ విద్యాలయంలో హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘నేను అంబేద్కర్ చెప్పిన మాటలను నమ్ముతా.. ఆయన చెప్పిన విధంగా గుడుల కన్నా బడులు మేలు.. బడులు నిర్మాణం చేస్తే మేధావులు తయారవుతారు. గుడులు నిర్మాణం చేస్తే భిక్షగాళ్లు తయారు అవుతారు’ అని మరో వివాదానికి తెరతీశాడు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే ఆయన ఐనవోలు మల్లికార్జునస్వామిని దర్శించుకోవడం గమనార్హం.