స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 18: స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం నుండి జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేసి తరగతులు ప్రారంభిం చనున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. సోమవారం గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను, వంటగదిని, పాఠశాల భవనాలను, వాటర్ ప్లాంట్, విద్యార్థులను భోజనాలను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో ఉన్న గడ్డి, చెట్ల పొదలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థులతో మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? పాఠాలు అర్థం అయ్యేలా చెబుతున్నారా వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ ఘనపూర్ గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలంటూ ఐటిడిఏ పీవోకు ఫోన్ చేసి సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండే జూనియర్ కళాశాల ప్రారంభం కావాలని అన్నారు. జూనియర్ కళాశాల నిర్వహణకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, సంబంధిత ఇంజినీరింగ్ విభాగం అధికారులకు కడియం
సూచించారు.
విద్యార్థులకు రక్త హీనత లేకుండా, ఆరోగ్యంగా ఉండేలా వారికి హెల్త్ చెకప్ చేయించాలని కడియం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిటిడివో ప్రేమకళ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మార్కెట్ చైర్ పర్సన్ లావణ్యాశిరీష్ రెడ్డి, యంఈవో జి.కొమురయ్య, హెచ్ఎం ధరావత్ రాజు, వార్డెన్ శ్రీమతి, నరేందర్ రెడ్డి, బెలిదె వెంకన్న, రామకృష్ణ, బూర్ల శంకర్ పాల్గొన్నారు.