హనుమకొండ, ఫిబ్రవరి 28 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై స్టేషన్‌ఘన్‌పుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ప్రతి సందర్భంలో ప్రతిపక్షాలను మగతనం అంటూ దుర్భాషలాడుతున్న రేవంత్‌రెడ్డి.. దమ్ముంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను గెలిపించుకొని తన మగతనం ఏమిటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. బుధవారం హనుమకొండలోని ఆయన నివాసంలో ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అరూరి రమేశ్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక భాష మార్చుకొని హుందాగా వ్యవహరిస్తాడని అనుకున్నానని కానీ రోజురోజుకూ సహనం కోల్పోయి ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నాడని కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయాలకు మగతనానికి సంబంధం ఏమిటని కడి యం ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ ఇద్దరు మహిళల నాయకత్వంలో పనిచేస్తూ మగతనం గురించి మాట్లాడడం వారిని కించపరిచినట్లేనని పేర్కొన్నారు. గతంలో పనిచేసిన సీఎంపై పరుష పదజాలం ఉపయోగించడం బాధాకరం అన్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నించే వారిపై దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి తీరు జుగుప్సాకరంగా ఉందని కడియం ఆరోపించారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపి దేశానికి రోల్‌మాడల్‌గా నిలుపడమే కాకుండా కేంద్రం, అంతర్జాతీయ సంస్థల మెప్పు పొందారని ఈ సందర్బంగా గుర్తుచేశారు. రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెంచి దేశంలోనే 2వ స్థానం, పంటల దిగుబడిని నంబర్‌వన్ స్థానంలో నిలిపారన్నారు. ప్రతి పల్లె, గూడానికీ రక్షిత మంచినీరు అందించిన కేసీఆర్ పరిపాలనా దక్షతను మెచ్చుకోకున్నా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, విజయాలను వైఫల్యాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంపై కడియం మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రతిష్టను జాతీయ స్థాయిలో దిగజార్చుతున్నారనే విషయాన్ని గమనించాలని లేకపోతే తీవ్రంగా నష్టపోతామని ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు గమనించాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీటి పారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిందని అందులో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93వేల కోట్లు ఖర్చుపెట్టి 98 వేల ఎకరాలకు మాత్రమే అదనంగా ఆయకట్టు వచ్చిందని అంటున్నారు కానీ 30లక్షల ఎకరాలకు సాగు నీటిని స్థిరీకరించిన విషయాన్ని మరచిపోతున్నారని కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కడియం ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీల పేరుతో ఇచ్చిన 13 హామీల అమలుపై ప్రశ్నించిన వారిపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఇది సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, బీఆర్ఎస్ మేనిఫెస్టో అమలుపై చర్చకు తాము సిద్ధం.. మీరు సిద్ధమా అని కడియం సవాల్ విసిరారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలనెలా ఆర్థిక సహాయం అందించడం లేదు, పింఛన్‌ను రూ.2వేల నుంచి 4వేలకు పెంచుతానన్నారు ఆ ఊసే లేదన్నారు. అలాగే రైతుబంధు, రుణమాఫీ విషయంలో స్పష్టత లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగా 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని కూల్చుతారనే భయం సీఎం రేవంత్‌రెడ్డికి పట్టుకుందని, మీ అంతట మీరు కూలిపోతే మాకు సంబంధం లేదని మీ వాళ్లతో కొంత జాగ్రత్తతో ఉండండి అంటూ హితవు పలికారు. చేవెళ్ల సభలో కూడా రేవంత్ మాటలు విడ్డూరంగా ఉన్నాయని, నా కుర్చీని తాకొద్దని పక్కనున్న మంత్రులకు చెప్పినట్లు అనిపించిందని కడియం పేర్కొన్నారు. విపక్షాన్ని చూపించి స్వపక్ష నేతలను హెచ్చరించినట్లు ఉందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆ కుర్చీ ఇనాం కిందనే వచ్చినట్లు మేం భావిస్తున్నామని ఎమ్మెల్యే కడియం అన్నారు. వారసత్వ రాజకీయాలను దేశంలో ప్రవేశపెట్టి కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ఆ కుటుంబం ఇనాం కింద ఇస్తేనే కదా నీకు కుర్చీ వచ్చింది కదా అని అన్నారు. ఇందిరాగాందీ పేరు లేకుండా బతుకలేని మీకు కుటుంబ పాలన గురించి మాట్లాడే హక్కులేదన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ విష ప్రచారం తిప్పికొట్టేందుకే మార్చి 1న మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వెళ్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు వివరాలు ప్రజలు తెలియజేస్తామన్నారు. ఇప్పటికైనా సీఎం తన భాష మార్చుకొని, హుందాతనంతో వ్యవహరించాలని కడియం శ్రీహరి హితవు పలికారు. సమావేశంలో వెంకటేశ్వర్రావు, జఫర్‌గఢ్ పీఏసీఎస్ సభ్యుడు కరుణాకర్‌రావు, లింగారెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డే కాదు సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ అని తెలిపారు. 3 బ్యారేజ్‌లు, 15 రిజర్వాయర్లు, 21 పంప్‌హౌస్‌లు 203 సొరంగ మార్గాలున్నాయని అన్నారు. ఇందులో సాంకేతిక కారణాలు, అధిక నీటి నిల్వ వంటి సమస్యలతో మూడు పిల్లర్లు కుంగిపోయాయని నిపుణులు, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీతో విచారణ జరిపి బాధ్యులు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ రాజకీయం, దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుతోవ పట్టిస్తూ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. రానున్న వర్షాకాలంలో వరదలు వచ్చి మేడిగడ్డ పూర్తిగా కొట్టుకపోతే దీన్ని అంతా గత ప్రభుత్వంపై ఆపాదించేందుకు కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తున్నదని అన్నారు. మీ దుర్మార్గపు ఆలోచనలు, రాజకీయాలతో రైతులను ఆగం చేయకుండా వెంటనే కాఫర్ డ్యాం నిర్మించి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు.