జనగామ, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో రెండోసారి ప్రజలు మోస పోవద్దని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. జనగామ పట్టణంలోని 5, 6, 7, 8, 9, 10 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గజువెల్లి ప్రతాప్, గుజ్జుల భక్తతుకారాం, ఖమర్ సాజీద్, పగిడిపాటి సుధ, గునిగంటి వెన్నెల, నీలం శ్రీలత గెలు పు కోసం రోడ్‌షో, కార్నర్ సభల్లో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి, ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పదేండ్లలో చేసిన అభివృద్ధి మీ కళ్లముందు ఉన్నదని, ఢిల్లీ పార్టీలకు ఓటు వేసి మళ్లీ మోసపోవద్దని కోరారు. మీరు వేసే ఓటుతో కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునే ప్రస్థానం ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. పట్టణ అభివృద్ధి అంతా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందే.. వచ్చేది మన ప్రభుత్వమే.. జనగామ జిల్లా కేంద్రం రూపురేఖలు మారేలా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని, తనను నమ్మండని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యర్థి పార్టీలు అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని, అమలు కాని హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు.
రౌడీలా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి..
నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి రౌడీలా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను బెది రిస్తూ, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. జనగామ జిల్లాను ఇచ్చింది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీయేనని, జిల్లాను మరింత అభివృద్ధి చేయాలంటే గులాబీ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తన నీలిమ హాస్పిటల్లో గత రెండేళ్లుగా ఉచిత వైద్య సేవలందిస్తున్నానని, రాబోయే మూడేళ్లు కూడా ఉచిత వైద్య సేవలు కొనసాగిస్తానని హామీ ఇచ్చా రు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎ మ్మెల్యే పల్లా పిలుపునిచ్చారు. కాగా, ప్రముఖ కవి, గాయకుడు మిట్టపెల్లి సురేందర్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొని తన పాటలతో ఉర్రూతలూగించారు.