ఖానాపురం, డిసెంబర్ 8: పాకాల ఆయకట్టు పరిధిలో యాసంగి పంటకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండలకేంద్రంలోని రైతు వేదికలో అధికారులు, రైతులతో కలిసి తైబందీ ఖరారు చేశారు. పాకాల ఆయకట్టులో అధికారికంగా 18,250 ఎకరాలు, అనధికారికంగా 11,250 ఎకరాలకు సాగునీరందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. డిసెంబర్ 25న యాసంగి సాగుకు నీరు విడుదల చేస్తామన్నారు.
ఏప్రిల్ నెలాఖరు నాటికి పంటకాలం పూర్తయ్యే విత్తనాలనే రైతులు సాగు చేసుకోవాలని కోరారు. పంటలకు సక్రమంగా నీరందించే బాధ్యత ఇరిగేషన్, రెవెన్యూ అధికారులదేనన్నారు. పాకాల పంట కాల్వల ఆధునీకరణను రూ. 225 కోట్లతో వచ్చే ఏడాది పనులు చేపడతామనన్నారు. సరస్సులో ప్రస్తుతం 22.8 అడుగుల నీరుందని, యాసంగి సాగుకు సరిపోనందున గోదావరి జలాలను తీసుకొస్తామన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు.
అనంతరం ఆయన మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. మిషన్తో తేమశాతం పరీక్షించగా, మొదటిసారి 34 వచ్చింది. మరోసారి పరీక్షించగా కొంతమేర తగ్గింది. మరో మిషన్తో పరీక్షించగా 31 శాతం వచ్చింది. దీంతో ఆశ్చర్యపోయిన ఎమ్మెల్యే నిర్వాహకులను మందలించారు. కచ్చితత్వం పాటించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ఉమారాణి, ఇరగేషన్ ఈఈ సుదర్శన్రావు, నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, తహసీల్దార్ కిరణ్కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ హరిబాబు, డీఈ రమేశ్, ఏఈలు, రైతులు పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే దొంతి అన్నారు. పట్టణంలోని సర్వాపురం 5వ వార్డులో నూతనంగా నిర్మించిన పద్మశాలీ సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేకు పద్మశాలీలు సన్మానించారు.