వరంగల్ : రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్తు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఆలోచన చేస్తుందని వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ..వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హసన్ పర్తి మండల కేంద్రంలో రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అందిస్తున్న 24గంటల ఉచిత విద్యుత్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఏనాడు ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ విధానాలను తెలంగాణ రాష్ట్ర రైతులు, ప్రజలు ఆలోచించాలన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతంగానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేపు, ఎల్లుండి అన్ని మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.